ఏ అధికారంతో స్వాధీనం చేసుకున్నారు?
♦ ఉన్నత విద్యామండలి ఆస్తులపై తెలంగాణకు సుప్రీం ప్రశ్న
♦ సెక్షన్ 75 సేవలకు ఉద్దేశించిందేనని వ్యాఖ్య
♦ తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత విద్యామండలి ఆస్తులను ఏ అధికారంతో స్వాధీనం చేసుకున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ద్వారా సంక్రమించిన అధికారంతోనే వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా.. సంబంధిత సెక్షన్ ఇరు ప్రాంతాలకు సేవలు అందించేందుకు ఉద్దేశించింది మాత్రమే అని వ్యాఖ్యానించింది. మంగళవారం ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాలకు సంబంధించిన కేసును విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తమ ఖాతాలు తెలంగాణ ఉన్నత విద్యామండలికే చెందుతాయంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ కేసు జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది.
జనాభా ప్రాతిపదికన పంచాలి: ఏపీ
ఏపీ ఉన్నత విద్యామండలి తరఫున సీనియర్ న్యాయవాది పీపీ రావు, ఏపీ ప్రభుత్వం తరఫున బసవ ప్రభు పాటిల్ వాదనలు విని పిస్తూ.. ప్రాంతీయ స్థాయి ఉన్న సంస్థలే తెలంగాణకు చెందుతాయని, ఏపీ ఉన్నత విద్యామండలి ప్రాంతీయ సంస్థ కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 53(4) ప్రకారం ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచాలని న్యాయస్థానాన్ని కోరారు. జనాభా నిష్పత్తిలో పంపిణీకి ప్రతిపాదించగా ఒక దశలో తెలంగాణ అంగీకరించిందని పాటి ల్ కోర్టుకు తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇదే తరహాలో విభజించిన తర్వాత తప్పు జరిగిందంటూ స్వాధీనం చేసుకున్నారని వివరించారు.
ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే..
తెలంగాణ తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాది అంధ్యార్జున వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆస్తులను పంచాలని తాము కోరడం లేదని వివరిస్తూ ఇందుకు పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఉదాహరణగా చూపారు. నగదు మినహా ఏ ప్రాంతంలో ఉన్న సంస్థల ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 కింద స్పష్టంగా ఉందని వాదించారు. ఈ సందర్భంలో రాష్ట్రం విడిపోయిన ఏడాది కాలంలో సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సి ఉందని, లేనిపక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని చట్టంలో ఉన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. రెండు రాష్ట్రాల సీఎస్‌లను సమావేశపరిచి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించిందని తెలిపారు. అవిభాజ్య రాష్ట్రం వెలుపల ఆస్తులు ఉంటే జనాభా ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంటుందని వివరించారు. రెండు పక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం అన్ని సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని, అన్నీ తెలంగాణకే చెందుతాయా? అంటూ వ్యాఖ్యానించింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు విడిపోయిన తరువాత అక్కడి వారిని అర్ధరాత్రి గెంటేశారని ధర్మాసనం గుర్తుచేసింది. ఏ ప్రాతిపదికన, ఏ అధికారంతో ఉన్నత విద్యామండలిని స్వాధీనం చేసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించగా ప్రాంతీయత ఆధారంగానే స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వివరించారు. ఆస్తుల పంపకానికి ఇది సరైన మార్గం కాదేమోనని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది.