* ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించబోయే ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) తేదీలను వచ్చే నెల 5న ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. వివిధ విశ్వ విద్యాలయాల వైస్‌చాన్సలర్లు, హైదరాబాద్ జేఎన్‌టీయూ అధికారులతో చర్చించి తాము నిర్వహించబోయే సెట్స్ తేదీలను ఖరారు చేస్తామని సోమవారం మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎంసెట్ తేదీ కంటే వారం పది రోజుల ముందుగానే తెలంగాణ ఎంసెట్ ఉండేలా షెడ్యూల్ ఖరారు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా అన్ని సెట్స్ తేదీలు ఉంటాయన్నారు. తెలంగాణలోని విద్యా సంస్థల్లో 15 శాతం ఓపెన్ కోటాలో మెరిట్ ఆధారంగా సీట్లు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా తాము నిర్వహించబోయే సెట్స్ రాయవచ్చని స్పష్టం చేశారు. ఈ కోటా ప్రవేశాల విషయంలో గందరగోళం తలెత్తకుండా ఏపీ ఒప్పుకొంటే ఆ ప్రభుత్వ ప్రతినిధిని కూడా ప్రవేశాల కమిటీలోకి సభ్యునిగా తీసుకుంటామన్నారు.
రాష్ర్ట విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం రెండు రాష్ట్రాల్లో సెట్స్ నిర్వహణ అధికారం తమకే ఉందని, ఏపీ ముందుకు వస్తే వారికీ సేవలు అందిస్తామన్నారు. ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల ప్రకటన విషయంలో ఏపీ విద్యా మండలి ఏకపక్షంగా వ్యవహరించిందని పాపిరెడ్డి విమర్శించారు. తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే షెడ్యూల్ ప్రకటించి, విద్యార్థులను ఏపీ సర్కారు గందరగోళంలో పడేసిందన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చట్టబద్ధత లేదన్న ఏపీ కౌన్సిల్ వాదన సరైంది కాదన్నారు.
తమకు చట్ట బద్ధత లేకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు తమను ఎందుకు బాధ్యులను చేస్తుందని ప్రశ్నించారు. రాష్ర్టంలో ఉమ్మడి ప్రవేశాల నిర్వహణకు తమను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. కాగా, తెలంగాణ ఎంసెట్‌ను ఏప్రిల్ 30న లేదా మే 3వ తేదీన జేఎన్‌టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఏపీ కంటే ముందే తెలంగాణ ఎంసెట్
Published Tue, Dec 30 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement