నైపుణ్యానిదే భవిష్యత్తు.. సాధారణ చదువులతో ఉపాధి అంతంత మాత్రమే  | Employment With General Education Is Limited,Skills Has Better Future | Sakshi
Sakshi News home page

నైపుణ్యానిదే భవిష్యత్తు.. సాధారణ చదువులతో ఉపాధి అంతంత మాత్రమే 

Published Mon, Nov 22 2021 2:09 AM | Last Updated on Mon, Nov 22 2021 2:09 AM

Employment With General Education Is Limited,Skills Has Better Future - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైపుణ్యంతో కూడిన విద్య అభ్యసిస్తేనే భవిష్యత్తు ఉంటుందని, ఎలాగో డిగ్రీ పూర్తి చేశామనుకుంటే చాలదని స్పష్టమవుతోంది. ఏదో ఒక అంశంలో నైపుణ్యం కలిగిన వారు కూడా ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకుంటూ సాంకేతిక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాన్ని అవరుచుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించేందుకు అన్ని స్థాయిల్లోనూ కసరత్తు జరుగుతోంది. డిగ్రీ స్థాయి నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ వృత్తి విద్య కోర్సుల్లోనూ కొనసాగుతోంది. 

ఏటా కుప్పలు తెప్పలుగా.. 
ఏటా కుప్పలు తెప్పలుగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన వారు ఉద్యోగాల వేటలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేలు, లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్‌ చేసిన వారికి కూడా ఉపాధి ఆమడ దూరంలోనే ఉంటోంది. ఏదో ఒక డిగ్రీలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల్లో దాదాపుగా సగం మందికి ఉపాధి లభించక పోవడం విస్మయం కలిగించే అంశమే అయినా వాస్తవం. 2020–21 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 1,34,763 మంది గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరారు.

ఇదే సంవత్సరంలో 85 వేల వరకు విద్యార్థులు తమ కోర్సులు పూర్తి చేశారు. అయితే ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 46,539 మాత్రమే. అకడమిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నా, నైపుణ్యం ఆశించిన మేర లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) ఇటీవల ఓ అధ్యయనంలో తేల్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాంకేతిక మండళ్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్యను అందించడం ఇప్పుడు అనివార్యమైంది.  

ఇంజనీరింగ్‌ విద్యకు అదనపు సాంకేతికత 
ఈ ఏడాది ఇంజనీరింగ్‌ విద్యకు మరింత సాంకేతికత జోడిస్తున్నారు. నాస్కామ్‌తో కలిసి ఇటీవల జేఎన్‌టీయూహెచ్‌ ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. రాబోయే కాలంలో ఏ తరహా సాంకేతికత పరిశ్రమలకు అవసరమో గుర్తించారు. దాన్ని ఇంజనీరింగ్‌ స్థాయి నుంచే విద్యార్థులకు బోధించడం ఇందులో ప్రత్యేకత. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు ఇందులో భాగస్వామ్యమవుతాయి. ఆ కంపెనీలే అవసరమైన సాఫ్ట్‌వేర్‌ లాంగ్వేజీని ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అందిస్తాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్, డేటాసైన్స్‌ కోర్సుల్లో అంతర్జాతీయ మార్పులను ఎప్పటికప్పుడు ఈ సంస్థలు విద్యార్థుల ముందుకు తెస్తాయి.

మెకానికల్, సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు సైతం ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకు ఓ వాహనం డిజైన్‌లో ముందుగా ఉపయోగించేది సాఫ్ట్‌వేర్‌. దాని సామర్థ్య పరీక్షలన్నీ కంప్యూటర్‌పైనే రూపొందిస్తారు. అదే విధంగా సివిల్‌లో నిర్మాణ రంగం మొత్తం సాఫ్ట్‌వేర్‌పైనే ఆధారపడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్‌ భాషతో కూడిన ప్రత్యేక ప్యాకేజీలు నాస్కామ్‌ విద్యార్థులకు అందిస్తుంది. అంతిమంగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

ప్రణాళికల్లో మార్పులు 
సంప్రదాయ డిగ్రీ కోర్సులను మరింత మెరుగ్గా అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఇటీవల ఓ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రయోగాత్మకంగా బీఏ హానర్స్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. తరగతి విద్య తక్కువ, క్షేత్రస్థాయిలో, ప్రాజెక్టు వర్క్‌ ఎక్కువగా ఉండేలా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తోంది. దేశవిదేశాల్లోని ఆర్థిక విధానాలను ఆర్థికశాస్త్ర అధ్యయనంలో జోడిస్తున్నారు.

విధానపరమైన నిర్ణయాలను రూపొందించే శక్తి సామర్థ్యాలు పెంపొందించేలా కోర్సుల్లో మార్పులు ఉండబోతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు డిగ్రీ కోర్సుల్లోనూ సాంకేతిక విద్యకు పెద్ద పీట వేస్తున్నారు. బీఎస్సీ డేటా సైన్స్‌ను కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌తో సత్సమానంగా తీర్చిదిద్దేలా పాఠ్యాంశాలు రూపొందించారు. బీకాం విద్యార్థి కేవలం సబ్జెక్టుకే పరిమితం కాకుండా విద్యార్థి దశలోనే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం సాధించేందుకు అవసరమైన బోధన మెళకువలను ప్రవేశ పెడుతున్నారు. బీఏ కోర్సులు చేసినా సాఫ్ట్‌వేర్‌ వైపు మళ్ళేందుకు వీలుగా కొన్ని రకాల సాఫ్ట్‌వేర్‌ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నారు.  

ఇది గొప్ప మార్పు 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో కూడిన విద్య నేటి తరానికి అవసరం. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిగ్రీ విద్యార్థిని కూడా ఉపాధి వేటలో ఏమాత్రం తీసిపోని విధంగా తయారు చేయాలన్నది లక్ష్యం. ఇంజనీరింగ్‌ విద్యార్థి కూడా మరింత నాణ్యమైన విద్యను సొంతం చేసుకునేలా ఆలోచనలు చేస్తున్నాం. తద్వారా వీరు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సొంతం చేసుకునే వీలుంది.  – ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement