మండలిలో ‘ఎంసెట్’ చిచ్చు!
ఏపీ ఉన్నత విద్యా మండలిలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు సంకటం
నేటి నుంచి తమ వద్దే పనిచేయాలంటూ టీ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు
విభజన కాకుండా వెళ్తే న్యాయపరమైన చిక్కులు తప్పవంటున్న ఏపీ మండలి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ వివాదం ఏపీ ఉన్నత విద్యామండలిలో కూడా గందరగోళాన్ని రేపింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు కావడంతో దానికి ఏపీ ఉన్నత విద్యామండలి తన భవనంలోని పై అంతస్తును కేటాయించింది. చైర్మన్‌కు, ఇతర ముఖ్యులకు వాహనాలు సమకూర్చింది. ఆ మండలికి తాత్కాలికంగా కొంతమంది ఉద్యోగులను కూడా సర్దుబాటు చేసింది. విభజన వ్యవహారం తేలేవరకు ఉద్యోగులు రెండు చోట్లా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా ఏపీ ఉన్నత విద్యామండలిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు మంగళవారం నుంచి తమ వద్ద మాత్రమే పనిచేయాలంటూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఏపీ మండలిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. తమ ఆదేశాల ప్రకారం రాకపోతే వేరేగా ఉద్యోగులను నియమించుకుని, వారినే శాశ్వత ఉద్యోగులుగా కొనసాగిస్తామని టీ మండలి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగులు తెలంగాణ ఉన్నత విద్యామండలికి వెళ్లాలంటే ముందుగా ఏపీ ఉన్నత విద్యామండలి అధికారికంగా విభజన అవ్వాలని, అది కాకుండా వె ళ్తే ఇబ్బందుల పాలవుతారని ఏపీ మండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ‘‘ఉన్నత విద్యా మండలిని కేంద్ర ప్రభుత్వం పదో షెడ్యూల్ నుంచి తొలగించాక నోడల్ అధికారిని నియమించి ఉద్యోగులు, ఆస్తులు అప్పుల పంపకాలు చేయాలి.
అప్పటివరకు అధికారిక విభజన కానట్టే’’ అని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ ఉన్నత విద్యామండలిలో ప్రస్తుతం 36 మంది ఉద్యోగుల్లో 14 మంది శాశ్వత ఉద్యోగులు... మిగతావారు ఒప్పంద ఉద్యోగులు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 10 మందికి మించి లేరు. సోమవారం తెలంగాణ ఉద్యోగులు ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కృష్ణమూర్తిని కలసి తెలంగాణ విద్యామండ లికి తమను కేటాయించాలని కోరారు. అనధికారికంగా ఎవరు ఎక్కడ పనిచేసినా అభ్యంతరం లేదని, అయితే అధికారిక బదిలీకి నిబంధనలు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు.