
నెలాఖరులోగా అన్ని సెట్స్
మూడో వారంలో నోటిఫికేషన్ల జారీ షురూ!
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ సహా వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా జారీ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల మూడో వారంలో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇటీవల నియమితులైన వివిధ సెట్స్ కన్వీనర్లు సోమవారం మండలి కార్యాలయంలో పాపిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్ల జారీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
నోటిఫికేషన్ల జారీని మూడో వారంలో ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈలోగా ఒక్కో సెట్‌కు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మొదట ఎంసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాపిరెడ్డితో సమావేశమైన వారిలో ఎంసెట్, లాసెట్, ఎడ్‌సెట్, ఈసెట్, ఐసెట్, పీజీ ఈసెట్, పీఈసెట్ కన్వీనర్లు రమణరావు, రంగారావు, ప్రసాద్, యాదయ్య, ఓంప్రకాష్, వేణుగోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రావు ఉన్నారు.
ప్రభుత్వం దృష్టికి ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నియంత్రణ
రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నియంత్రణ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. కనీస వసతుల్లేకపోయినా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండడం, ఫంక్షన్‌హాళ్లలో ఒక్కో బ్యాచ్‌లో వేయి మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.