ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రితో సమావేశమైన జనక పుష్పనాథన్
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణ భారత విభాగంతో కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధన ప్రణాళికను రూపొందించే ప్రయత్నంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అనూహ్య పురోగతి సాధిస్తోందని బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాథన్∙ప్రశంసించారు. ఉన్నత విద్యలో లోతైన విషయ పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించి, ఉపాధి అవకాశాలు పెంచేలా డిగ్రీ పాఠ్య ప్రణాళికను రూపొందించాలని ఉన్నత విద్యా మండలి భావించింది.
ఈ ప్రక్రియలో భాగంగా 2018లో బ్రిటిష్ కౌన్సిల్, టీఎస్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఆ తర్వాత యూకేకి చెందిన బంగోర్, అబ్యరిస్విత్ యూనివర్సిటీలు– తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల మధ్య 2020 మార్చిలో విద్యా ప్రాజెక్టుల రూపకల్పనపై ఎంవోయు జరిగింది. దీని పురోగతిపై మంగళవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, కాకతీయ వర్సిటీ వీసీ టి.రమేశ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణాది డైరెక్టర్ జనక పుష్పనాథన్, ఉన్నత విద్య డైరెక్టర్ సోను ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాగస్వామ్య విశ్వవిద్యాలయాల సహకారంతో జూన్ 2023 నాటికి ఆశించిన కొత్త విద్యా ప్రణాళికను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment