వేరుగా నోటిఫికేషన్ | Telangana Higher education council to give notification for Eamcet counselling | Sakshi
Sakshi News home page

వేరుగా నోటిఫికేషన్

Published Fri, Aug 8 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

Telangana Higher education council to give notification for Eamcet counselling

* ఎంసెట్ కౌన్సెలింగ్‌పై టీ ఉన్నత విద్యామండలి చైర్మన్
* ధ్రువపత్రాల పరిశీలనకు వీలైతే రేపే నోటిఫికేషన్
* ‘సుప్రీం’ తీర్పును బట్టి 12 నుంచి ప్రక్రియ
* వెబ్ ఆప్షన్లు మాత్రం ఉమ్మడిగా చేపట్టే అవకాశం
* విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని సూచన
* నేడు టీ ఉన్నత విద్యామండలి సమావేశం
 
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీకి తెలంగాణలో వేరుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. వీలయితే ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేసి.. 12 నుంచి వెరిఫికేషన్ చేపట్టే అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్లను మాత్రం రెండు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి చే పట్టే అవకాశం ఉంది. మండలి చైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సర్టిఫికెట్ల తనిఖీ, వెబ్ ఆప్షన్లు, ఇతర అంశాలపై తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో గురువారం సాయంత్రం 4 గంటలకు పాపిరెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయం రెండో అంతస్తులోని ప్రస్తుత కార్యదర్శి చాంబర్‌ను కేటాయించారు. అనంతరం పాపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తామని.. ఇందులో ఎంసెట్‌కు సంబంధించిన అన్ని అంశాలను చర్చిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణకు వేరుగా ధ్రువపత్రాల తనిఖీ షెడ్యూలును ప్రకటిస్తామని.. ఏపీ మండలి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పునకు, రాష్ట్ర విభజన చ ట్టంలోని నిబంధనలకు లోబడే ఈ ప్రక్రియ చేపడతామని.. ఆ మేరకే ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రవేశాల ప్రక్రియ అనుకున్నంత త్వరగా పూర్తి కాకపోవచ్చని, అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాపిరెడ్డి భరోసా ఇచ్చారు. ప్రవేశాల ప్రక్రియ గతంలోనూ ఆలస్యం అయిందని, ప్రస్తుతం విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని చెప్పారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ హెల్ప్‌లైన్ కేంద్రాలకు సంబంధించి ఇంకా అన్ని ఏర్పాట్లు పూర్తి కాలేదన్నారు.

సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పాపిరెడ్డి చెప్పారు. తాము చేపట్టబోయే ప్రక్రియ కామన్ అడ్మిషన్ విధానం ప్రకారమే ఉంటుందని, కోటా విషయంలో ఏపీ విద్యార్థులకు ఏ నష్టమూ ఉండదన్నారు. కాగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా పాపిరెడ్డి వెంట విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు తదితరులు వెంట ఉన్నారు. అనంతరం ఏపీ మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, కాసేపు చర్చించారు. పాపిరెడ్డి అంతకుముందు గవర్నర్ నరసింహన్‌ను కూడా కలిసి వచ్చారు.
 
 టీ మండలికి ఇద్దరు వైస్ చైర్మన్లు
తెలంగాణ ఉన్నత విద్యా మండలికి పూర్తిస్థాయి పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలమూరు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఎస్.వెంకటాచలం, ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.మల్లేశంలను వైస్ చైర్మన్లుగా నియమించారు. టీ మండలికి సంబంధించి గత ఉత్తర్వుల్లో ఒక వైస్ చైర్మన్ అని మాత్రమే పేర్కొనగా... ఆ ఉత్తర్వులను సవరిస్తూ ఇద్దరు వైస్ చైర్మన్లు అని చేర్చారు.

ఇక కార్యదర్శిగా శ్రీనివాసరావు పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై మండలి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న మండలి కార్యదర్శి సతీష్‌రెడ్డి ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా కొనసాగుతారు. మండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తెలంగాణలోని వివిధ వర్సిటీల వైస్ చాన్సలర్లను... సభ్యులుగా పలువురు విద్యా రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలను నియమిం చారు.

సభ్యుల కేటగిరీలో ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల్లో పనిచేసిన ప్రొఫెసర్లు పీవీ రమణారావు, ధనావత్ సూర్య, ఎ.సదానందం, సి.వెంకటయ్యతో పాటు పారిశ్రామికవేత్తలైన సాల్‌గుటీ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ నామినే టెడ్ కేటగిరీలో ఇందూ అరణ్యకు చెందిన ఒ.నర్సింహారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి.పాపయ్య, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్  పి.లక్ష్మీనారాయణను (టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌గా) నియమించారు. వీరంతా మూడేళ్లు ఈ పదవుల్లో కొనసాగుతారు.
 
 ఏపీలో వెరిఫికేషన్ ప్రారంభం
 ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలోని విద్యార్థుల సర్టిఫికెట్ల తనిఖీని ప్రారంభించారు. దీనికి ఒకటి నుంచి 5 వేల ర్యాంకులోపు విద్యార్థులు 2,716 మంది గురువారం హాజరు కావాల్సి ఉండగా... సాయంత్రం 6 గంటల వరకు 725 మంది మాత్రమే వచ్చారు. ఇక ఎన్‌సీసీ, వికలాంగులు, స్పోర్ట్స్ తదితర ప్రత్యేక విభాగాల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు హైదరాబాద్‌లోని సాంకేతిక భవన్‌లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు.
 
 నిర్ణయాధికారం మాదే: ఏపీ మండలి చైర్మన్
 ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహణలో నిర్ణయాధికారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికే ఉంటుందని మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని విద్యా మండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం ఉమ్మడి ప్రవేశాలు, కౌన్సెలింగ్‌లపై అధికారం తమదేనని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక ఉన్నత విద్యా మండలి ఏర్పాటైనందున.. ఆ మండలి చైర్మన్ పాపిరెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రవేశాల కమిటీల్లో చేర్చుతామని... ఈ మేరకు కమిటీల సమావేశాలకు ఆయనను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
 
వృత్తి విద్యా కోర్సులపైనా దృష్టి
 ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో.. ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై అధికారులు దృష్టి సారించారు. లాసెట్, ఎడ్‌సెట్, పాలిసెట్, ఈసెట్ ద్వారా చేపట్టాల్సిన వృత్తి విద్య సీట్ల భర్తీకి ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా ఆయా సెట్‌ల ప్రవేశాల కమిటీలను సమావేశపర్చి.. ధ్రువపత్రాల తనిఖీ, కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు తేదీలను ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement