Eamcet Counselling: Reduced Civil And Mechanical Seats In Counselling - Sakshi
Sakshi News home page

EAMCET Counselling: ఆ సీట్లు ఏమైనట్టు?

Published Fri, Jun 30 2023 6:04 AM | Last Updated on Fri, Jun 30 2023 9:51 AM

Reduced Civil and Mechanical seats in counselling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది సివిల్, మెకానికల్‌ సీట్లు భారీగా తగ్గే అవకాశం కన్పిస్తోంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో చేర్చిన సీట్ల వివరాలే దీనికి నిదర్శనం. ఇప్పటివరకూ కౌన్సెలింగ్‌ జాబితాలో చేర్చిన సీట్లలో ఎక్కువగా కంప్యూటర్‌ సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ ఏఐఎంఎల్, ఇతర కంప్యూటర్‌ కోర్సులవే ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో సీట్లు తక్కువగా కన్పిస్తున్నాయి.

దీన్నిబట్టి చూస్తే ఈ విభాగాల్లో సీట్లు కంప్యూటర్‌ కోర్సుల్లోకి మారబోతున్నాయా? లేదా కాలేజీలు రద్దు చేసుకుంటాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే వంద కాలేజీల వరకూ సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించాలని, కంప్యూటర్‌ సైన్స్, ఇతర కోర్సుల్లో సీట్లు పెంచాలని దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కారణంగానే దాదాపు 40 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో పెట్టలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

ఆప్షన్లన్నీ సీఎస్‌ఈ వైపే... 
ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు ఇప్పటివరకు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడత సీట్లు కేటాయించే నాటికి ఈ సంఖ్య 80 వేలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్‌ విభాగంలో 1,56,879 మంది అర్హత సాధించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిలో ఎక్కువ మంది కంప్యూటర్‌ కోర్సులకే ఆప్షన్లు ఇస్తున్నారు. ఇందులో ఎంసెట్, జేఈఈ ర్యాంకర్లు కూడా ఉన్నారు. తొలిరోజు దాదాపు 6 వేల మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 5 వేలు సీఎస్సీ, ఇతర కంప్యూటర్‌ కోర్సులవే ఉన్నాయి.

తొలి విడత కౌన్సెలింగ్‌లో కూడా 62,079 సీట్లు చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.05 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లుండగా, ఇందులో సివిల్‌ 3087, మెకానికల్‌ 2667, ఎలక్ట్రికల్‌ 3854 సీట్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 30 శాతం తగ్గాయి. ప్రైవేటు కాలేజీలు కోరినట్టు బ్రాంచీల్లో సీట్ల మార్పు జరిగితే కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే గత ఏడాది సివిల్‌లో 36.38, మెకానికల్‌లో 31.92, ఈఈఈలో 56.49 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.  

ఆ సీట్లపై ప్రైవేటు కాలేజీల గురి 
కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ఈ ఏడాది భారీగా సీట్లున్నాయి. అయినప్పటికీ విద్యార్థుల డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ప్రైవేటు కాలేజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. జేఈఈ, ఎంసెట్‌లో 3 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల చేత మొదటి కౌన్సెలింగ్‌లోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి. వీళ్లకు కంప్యూటర్‌ కోర్సుల్లో తొలి దశలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముందు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసినప్పటికీ, ఆఖరి కౌన్సెలింగ్‌ వరకూ వీళ్లు కాలేజీల్లో చేరరు.

జేఈఈ ర్యాంకు ఉండటంతో జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరతారు. రాష్ట్రంలో అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో తొలి విడతలో వచ్చిన సీటును వదులుకుంటున్నారు. అప్పుడు ప్రైవేటు కాలేజీలు స్పాట్‌ అడ్మిషన్‌లో ఇష్టమొచ్చిన వాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే, దీన్ని కట్టడి చేయడం ఎవరి వల్లా కావడం లేదని సాక్షాత్తు అధికార వర్గాలు చెబుతుండటం కొసమెరుపు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement