వందొస్తే టాప్‌ కాలేజీల్లో సీఎస్‌సీ! | Expert assessment on engineering seats | Sakshi
Sakshi News home page

వందొస్తే టాప్‌ కాలేజీల్లో సీఎస్‌సీ!

Published Tue, May 14 2024 4:55 AM | Last Updated on Tue, May 14 2024 4:55 AM

Expert assessment on engineering seats

ఇంజనీరింగ్‌ సీట్లపై నిపుణుల అంచనా.. 10 రోజుల్లో సెట్‌ ఫలితాలు వెల్లడయ్యే చాన్స్‌ 

ఈసారి ఎక్కువ శాతం అర్హులయ్యే అవకాశం.. ఆప్షన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు మరో 20 రోజుల్లో వెలువడే అవకాశముంది. ఇప్పటికే కీ విడుదల చేశారు. దీన్ని బట్టి ఎన్ని మార్కులు వస్తాయనేది విద్యార్థులకు ఓ అంచనా ఉంది. ఈ మార్కుల ఆధారంగా ఏయే ర్యాంకులు వస్తాయి? ఆ ర్యాంకుకు అనుకున్న కాలేజీలో సీటు వస్తుందా? అనే ఉత్కంఠ విద్యార్థుల్లో కన్పిస్తోంది. అయితే ఇంజనీరింగ్‌ ప్రశ్నపత్రం కష్టంగా లేదని, ఎక్కువ మంది అర్హత సాధించే వీలుందని నిపుణులు అంటున్నా రు. సాధారణ విద్యార్థి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్‌ సబ్జెక్టుల నుంచి 40 ప్రశ్నలకు జవాబులు ఇచ్చే చాన్స్‌ ఉందంటున్నారు. 160 ప్రశ్నల్లో ఎక్కువ మంది 50 శాతానికి పైగానే కరెక్టు సమాధానాలు రాయవచ్చని అంచనా వేస్తున్నారు. 100 మార్కులొస్తే టాప్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు వచ్చే అవకాశముందని నిపుణులు విశ్షిస్తున్నారు. 

సీఎస్‌సీ సీటు ఈజీనే 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద 80 వేల వరకూ సీట్లు అందుబాటులో ఉండే వీలుంది. ఇందులో 58% కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్‌ కోర్సు సీట్లు ఉంటాయి. గత ఏడాది సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్‌ బ్రాంచిల్లోని సీట్లు కాలేజీలు రద్దు చేసుకోవడం, కొత్తగా పెరిగిన సీట్ల వల్ల కంప్యూటర్‌ కోర్సుల సీట్లు అదనంగా 14 వేలు పెరిగాయి. కాబట్టి ఈసారి కంప్యూటర్‌ కోర్సుల్లో సీట్లు పొందడం తేలికేనని నిపుణులు అంటున్నారు. గత ఏడాది ఆఖరి దశ కౌన్సెలింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటే టాప్‌ కాలేజీల్లో సీఎస్‌సీ సీటు 4 వేల ర్యాంకు వరకూ వచ్చింది. 

ఈ ఏడాది కూడా ఇంచుమించు ఇదే ర్యాంకు వరకూ ఉండే వీలుందని తెలుస్తోంది. అయితే కాలేజీతో పనిలేదు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచిలో సీటే ప్రధానం అనుకుంటే 35 వేల ర్యాంకు వరకూ ఆ సీటు వచ్చే వీలుంది. 50 వేల ర్యాంకు దాటితే మాత్రం సీఎస్‌సీ సీటును ఆశించలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెట్‌లో కనీసం 40 నుంచి 50 మార్కులు తెచ్చుకుంటే ఆ విద్యారి్థకి 35 నుంచి 50 వేల ర్యాంకు వచ్చే వీలుందని చెబుతున్నారు. అదే 90 నుంచి 100 మార్కులు వస్తే 1500 నుంచి 3600 ర్యాంకు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. 

ముందే అంచనా వేయాలి
గత కొన్నేళ్ళుగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను పరిశీలించాలి. ఎన్ని మార్కులకు ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో ఏయే బ్రాంచిల్లో సీట్లు వస్తున్నాయి? అనేది ముందుగానే అంచనా వేసుకోవాలి. మొదటి దశ కౌన్సెలింగ్‌లో పక్కాగా సీటు వచ్చే కాలేజీని ఎంపిక చేసుకునేందుకు కొంత కసరత్తు చేసి ఆప్షన్లు ఇచ్చుకుంటే కోరుకున్న బ్రాంచిలో సీటు అవకాశం ఉంది. 
– ఎంఎన్‌ రావు (గణితశాస్త్ర సీనియర్‌ అధ్యాపకుడు)  

ఎన్ని మార్కులొస్తే.. ఎంత ర్యాంకు? 
మార్కులు        ర్యాంకు 
140పైన        100 
130పైన        200 
120పైన        300 
110–120    800–300 
100–110    1500–800 
90–100        3600–1500 
80–90        6000–3600 
70–80        12000–6000 
60–70        20000–12000 
50–60        35000 – 20000 
40–50        50000 – 35000 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement