సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే కౌన్సెలింగ్ షెడ్యూల్! | Telangana Higher education council to release Eamcet counselling notification | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే కౌన్సెలింగ్ షెడ్యూల్!

Published Sat, Aug 9 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే కౌన్సెలింగ్ షెడ్యూల్!

సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే కౌన్సెలింగ్ షెడ్యూల్!

సొంతంగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకే సిద్ధమైన రాష్ర్ట ప్రభుత్వం.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

* కౌన్సెలింగ్‌పై తెలంగాణ ఉన్నత విద్యా మండలి తొలి భేటీలో నిర్ణయం
* ఎల్లుండి కోర్టు ఆదేశాలను బట్టి చర్యలకు యోచన
 
సాక్షి, హైదరాబాద్: సొంతంగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకే సిద్ధమైన రాష్ర్ట ప్రభుత్వం.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణకు వేరుగా షెడ్యూల్ ప్రకటిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కౌన్సెలింగ్‌కు గడువు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 11న సుప్రీంలో తుది విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజున సుప్రీం నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు.

ఈ నేపథ్యంలో తీర్పు వచ్చిన తర్వాత సమావేశమై ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలపై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తొలి పాలకవర్గ సమావేశం శుక్రవారం సచివాయంలో జరిగింది. పలు దపాలుగా జరిగిన భేటీలో మండలి చైర్మన్ పాపిరెడ్డితోపాటు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యర్, మండలి వైస్ చైర్మన్, కార్యదర్శితో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు.

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. కాలేజీల టాస్క్‌ఫోర్స్ తనిఖీలకు ఇంకా ఎంత సమయం పడుతుందనే విషయాన్ని పరిశీలించారు. కోర్టు తీర్పు రానున్నందున ముందుగానే షెడ్యూలు ప్రకటించడం ఎందుకనే దిశగా చర్చ జరిగినట్లు తెలిసింది. పైగా తెలంగాణ ప్రభుత్వం ఇంకా వాదనలు వినిపించాల్సి ఉన్నందున కూడా ప్రస్తుతానికి షెడ్యూల్‌ను ప్రకటించకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

అందుకే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాలని నిర్ణయించారు. ఇందుకోసం సాయంత్రం 5 గంటలకు అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఆయనను కలవలేకపోయారు. దీంతో కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే ఈ విషయంలో స్పందించాలని నిర్ణయించారు. కాగా, ఈ సమావేశానికి ముందే విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోనూ అధికారులు చర్చించారు.
 
విధుల్లో చేరిక
సమావేశానికి ముందే తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశం, కార్యదర్శి శ్రీనివాసరావు తమ బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు ఇతర సభ్యులూ చైర్మన్ పాపిరెడ్డికి రిపోర్టు చేశారు. మరో వైస్ చైర్మన్ వెంకటాచలం కూడా చైర్మన్‌ను కలిసినప్పటికీ విధుల్లో చేరలేదు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement