![Corona Virus: All Exams Postponed In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/25/Telangana-Exams.jpg.webp?itok=29Zua4DM)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర అన్ని కోర్సుల సెమిస్టర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఫార్మసీ, ఎంటెక్ తదితర కోర్సులకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. విద్యా సంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటినీ బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో కొనసాగుతున్న సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని మంగళవారం ఆయా విశ్వవిద్యాలయాలు ప్రకటించాయి.
దీంతో ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ అయింది. విద్యాసంస్థలనే మూసివేసినప్పుడు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తూ.. వాటిని కూడా వాయిదా వేసేలా విశ్వవిద్యాలయాలకు ఆదేశాలివ్వాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. దీంతో అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ప్రకటించారు.
ఆన్‌లైన్ తరగతులకు ఓకే..
మరోవైపు పరీక్షలను వాయిదా వేయాలని, ఆన్‌లైన్ తరగతులను మాత్రమే కొనసాగించాలని వర్సిటీల రిజిస్ట్రార్లకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ ఇన్‌చార్జి కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ లేఖ రాశారు. ప్రస్తుతం అన్ని కోర్సుల పరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్షల నిర్వహణ తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఆయా యూనివర్సిటీలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment