ఇంకా పెత్తనం చెలాయిస్తే ఊరుకోం
టీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి
ఏపీ ఉన్నత విద్యావుండలిపై మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలపై ఆజమాయిషీ అధికారం తెలంగాణ ప్రభుత్వానికే ఉంటుంది, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ర్యాటిఫికేషన్ అధికారం కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలికే ఉంటుంది’ అని టీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. వివిధ రకాల కోర్సులకు సాధ్యమైనంత త్వరగా మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలు పూర్తి చేసి తెలంగాణ ఉన్నత విద్యా మండలికే ర్యాటిఫికేషన్ ఫైళ్లను పంపించాలని తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ఏపీ మండలికి పంపితే తరువాత పరిణావూలకు కాలేజీలే బాధ్యతవహించాలని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఏపీ ఉన్నత విద్యా మండలి ఇంకా పెత్తనం చలాయిస్తే ఊరుకోబోమని తెలిపారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఉన్నత విద్యా మండలి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. పాలన పరమైన సమస్యల వల్ల ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తి చేసేందుకు అక్టోబర్ 31 వరకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, ఆగస్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేస్తామంటూ ఏపీ ఉన్నత విద్యా మండలి కేసులో ఇంప్లీడ్ అయి మరీ సుప్రీంకోర్టుకు చెప్పిందని గుర్తుచేశారు. ఇపుడేమో మళ్లీ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అంటున్నారెందుకని ప్రశ్నించారు. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని చెప్పిన ఏపీ ఉన్నత విద్యా మండలి ఇపుడు మొదటి దశ కౌన్సెలింగ్ అరుున వారికి తరగతులు ప్రారంభిస్తే, రెండో దశవారి సంగతేమిటని ప్రశ్నించారు. పైగా రెండో విడత ప్రవేశాలు చేపట్టాలంటే మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించి, కోర్టు అనుమతిస్తేనే చేపట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా చెప్పారని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో ఏపీ ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజన ఉత్తర్వులు వస్తాయని తెలిపారు.