ర్యాంకు తెలియకున్నా.. సీటు కోసం పరుగులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ‘కీ’విడుదల కావడంతో ఇంజనీరింగ్ సీట్ల కోసం విద్యార్థుల హడావుడి మొదలైంది. టాప్‌టెన్ కాలేజీల్లో సీట్లు రిజర్వ్ చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఇక మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా దృష్టి సారించాయి. ఆసక్తి చూపే విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ టాప్‌టెన్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తామని దళారులు ఆకర్షిస్తున్నారు. ప్రముఖ కాలేజీల్లో సీటుకు డొనేషన్ల రూపంలో లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు.
ఫలితాలకు ముందే సీటు రిజర్వ్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. వాస్తవానికి ఎంసెట్ ఫలితాలు ఈ నెల 25న విడుదల చేస్తామని ఎంసెట్ కౌన్సిల్ ప్రకటించింది. 30 నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అయ్యాకే మేనేజ్మెంట్ సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టాలని, జేఈఈ ర్యాంకును కూడా పరిగణనలోకి తీసుకోవాలని కొన్ని ప్రధాన ప్రైవేటు కాలేజీలు కచ్చితమైన నిబంధనలు పెట్టుకున్నాయి.
ఈ నెల 12న ఎంసెట్ ‘కీ’విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఇప్పటికే తమకు ఎన్ని మార్కులొస్తాయో అంచనా వేసుకున్నారు. అయితే ఇంటర్ మార్కుల ద్వారా వచ్చే 25 శాతం వెయిటేజ్ లేకపోవడంతో కచ్చితమైన ర్యాంకు అంచనా వేయలేకపోతున్నారు. ప్రభుత్వ, టాప్‌టెన్ కాలేజీల్లో సీటు సంపాదించే మార్కులు ఎంసెట్‌లో రాని వారు మాత్రం మేనేజ్మెంట్ కోటా కోసం యత్నిస్తున్నారు. వారి తల్లిదండ్రులు సీటు రిజర్వు చేసుకునే యోచనలో ఉన్నారని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకుడు తెలిపాడు.
వెయిటేజ్ అంచనా కష్టమే..:
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 189 వరకు ఉన్నాయి. ఇందులో 175 వరకు ప్రైవేటు కాలేజీలే ఉన్నాయి. నిజానికి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సీట్లు తగ్గాయి. మరోవైపు ఎంసెట్‌కు హాజరైన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ ఏడాది 1,08,812 సీట్లకే అనుమతించింది. గతేడాది ఏఐసీటీఈ 1,11,143 సీట్లకు అనుమతించింది. కాలేజీల్లో మౌలిక సదుపాయాలను పరిగణనలోనికి తీసుకుని కొన్ని కాలేజీల సీట్లకు కోత పెట్టడం వల్ల 335 సీట్లు తగ్గాయి. ఈ ఏడాది 1,65,044 మంది ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో 81 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. కోవిడ్ కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఇష్టం లేని వారు రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ చేయాలని భావిస్తున్నారు. పరీక్షలు లేకపోవడంతో ఇంటర్మీడియట్లో అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఫలితంగా ఎంసెట్ అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఏటా 45 శాతం ఇచ్చే ఇంటర్ వెయిటేజ్ కూడా లేకపోవడంతో ఎంసెట్ కౌన్సిల్ ప్రకటించే వరకు ర్యాంకు తెలిసే అవకాశం లేదు.
సీఎస్ఈకి యమ డిమాండ్..
రాష్ట్రంలోని 175 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,05,419 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఎంసెట్ రాసిన వారిలో 80 శాతంపైగా మార్కులొచ్చిన వారు 52 శాతం మంది ఉన్నట్లు అంచనా. టాప్ టెన్ కాలేజీల్లో సీటు రావాలంటే 7 వేల లోపు ర్యాంకు తప్పనిసరి. ఎంసెట్‌లో 100 మార్కులకు పైగా వస్తేనే ఈ ర్యాంకు సాధ్యం. దీంతో నచ్చిన గ్రూపు, పేరున్న కాలేజీలో సీటు పొందాలంటే మేనేజ్మెంట్ కోటాకు వెళ్లక తప్పట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. వారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ)కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కాలేజీలు రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఇటీవల మలక్‌పేటకు చెందిన వ్యక్తి తన కూతురుకు 65 మార్కులు రావడంతో టాప్‌టెన్‌లో ఉన్న మహిళా కాలేజీలో సీటు కోసం ప్రయత్నించాడు. సీఎస్ఈకి దళారీ రూ.12 లక్షలు డిమాండ్ చేశాడు. కాలేజీ యాజమాన్యంతో బేరమాడి రూ.10 లక్షలకు సీటు ఇప్పిస్తానని చెప్పినట్లు ఆ వ్యక్తి చెప్పాడు.