కౌన్సెలింగ్ మేమే నిర్వహిస్తాం! | We conduct EMCET Counselling, Telangana Higher Education Council | Sakshi
Sakshi News home page

కౌన్సెలింగ్ మేమే నిర్వహిస్తాం!

Published Tue, Aug 12 2014 1:31 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

We conduct EMCET Counselling, Telangana Higher Education Council

సుప్రీం తీర్పు నేపథ్యంలో తెలంగాణ సర్కారు కసరత్తు
సీఎం కేసీఆర్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ భేటీ
ఉమ్మడిగానే ఆప్షన్లు, ప్రవేశాలు తప్పదంటున్న అధికారులు
 
 సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను తామే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీం తీర్పునకు లోబడి, రాష్ర్ట విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియను తామే చేపట్టాలని తాజాగా నిర్ణయానికి వచ్చింది. పైగా ఎంసెట్ పరీక్షను నిర్వహించిన జేఎన్‌టీయూహెచ్ తమ పరిధిలోనే ఉన్నందున తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే కౌన్సెలింగ్ చేపట్టాలని అభిప్రాయపడుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అధికారులతో చర్చించేందుకు విద్యా శాఖ అధికారులు సిద్దమవుతున్నారు. వీలైతే మంగళవారమే షెడ్యూల్ జారీ చేసి.. వెంటనే సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించాలని కూడా భావిస్తున్నారు. 
 
అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వేర్వేరుగా చేపట్టినా, కౌన్సెలింగ్ ఎవరు నిర్వహించినా వెబ్ ఆప్షన్లను మాత్రం ఉమ్మడిగానే ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఒకే పరీక్ష ద్వారా ఉమ్మడి ర్యాంకులు కేటాయించినందున ఈ విధానం తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. పైగా విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలన్నా.. ఉమ్మడిగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ నెలాఖరులోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో సోమవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే నిర్వహిస్తామని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన తెలిపారు. 
 
మరోవైపు సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణలోనూ కౌన్సెలింగ్ చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి కూడా ప్రకటించారు. తెలంగాణ అధికారులతో సమావేశమై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను ఖరారు చేస్తామని చెప్పారు. వీలైతే ఈనెల 14 నుంచి వెరిఫికేషన్ ప్రారంభించి.. ఈ నెల 23లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. మొదటి దశ కౌన్సెలింగ్‌ను ఈ నెల 31లోగా పూర్తి చేసి తరగతులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజులుగా దాదాపు 10 వేల మంది వెరిఫికేషన్ పూర్తయిందని, తెలంగాణలోనూ రోజుకు పది లేదా 20 వేల మందికి వెరిఫికేషన్ చేస్తే 23వ తేదీ నాటికి వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement