EMCET Counselling
-
ఇక ఉమ్మడిగా ఎంసెట్ ప్రవేశాలు
17 నుంచి వెబ్ ఆప్షన్లు 26, 27 తేదీల్లో తుది మార్పులకు అవకాశం 30న సీట్ల కేటాయింపు, 1 నుంచి తరగతులు షెడ్యూల్ ప్రకటన.. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు గాడిన పడింది! ఇరు రాష్ట్రాల్లో వేర్వేరుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్నప్పటికీ ఉమ్మడిగానే ప్రవేశాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నుంచే ఉమ్మడి కార్యాచరణ మొదలుకానుంది. ఈ నెల 17 నుంచే రెండు రాష్ట్రాల విద్యార్థులకు కలిపి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కమిటీ తాజాగా ప్రకటిం చింది. 25వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో బుధవారం ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు ఇందులో పాల్గొనలేదు. ప్రవేశాల కమిటీ కన్వీనర్ అజయ్‌జైన్, కోకన్వీనర్ శైలజా రామయ్యార్ మాత్రమే పలు అంశాలపై చర్చించారు. చివరకు ఉమ్మడిగా వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభ తేదీలను ఖరారు చేశారు. అనంతరం ఈ వివరాలను ప్రకటించారు. వెబ్ ఆప్షన్ల తర్వాత ఈ నెల 26, 27 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పిస్తామని, 30వ తేదీన సీట్లను కేటాయిస్తామని, వచ్చే నెల 1వ తేదీన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రవేశాల కమిటీ వెల్లడించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో గురువారం నుంచి 23వ తేదీ వరకు రాష్ర్ట వ్యాప్తంగా 23 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్ జరుగుతుందని కమిటీ తెలిపింది. ఇదే సమయంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 30న సాయంత్రం 6 గంటల తర్వాత వెబ్సైట్లో(https://eamcet.nic.in) సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటిస్తారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయి సీట్ల కేటాయింపు లేఖను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో 315.. ఏపీలో 350 కాలేజీలు తెలంగాణలో 315 ఇంజనీరింగ్ కాలేజీలకు, ఆంధ్రప్రదేశ్‌లో 350 కాలేజీలకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన అఫిలియేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని ఈనెల 15వ తేదీ నాటికి ఇది పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆ వెంటనే విద్యార్థులకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వీలుగా ఆయా కాలేజీలు, వాటిలోని సీట్ల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఇక మైనారిటీ కాలేజీలు, సొంత ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే కాలేజీలకు సంబంధించిన వివరాలు తమకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నుంచి రావాల్సి ఉందన్నారు. ఈ నెల 15 లేదా 20వ తేదీ నాటికి వీటిపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు ఇప్పటివరకు పూర్తయిన 8 ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఉమ్మడి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. వీటిలో నాలుగింటి చొప్పున పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాంకేతిక విద్యా కమిషనర్లు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఒకరు కన్వీనర్‌గా ఉంటే.. మరో రాష్ర్ట అధికారి కోకన్వీనర్‌గా ఉంటారు. మరో నాలుగు రోజుల్లో ఐసెట్, ఈసెట్ ప్రవేశాలకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ తేదీ ర్యాంకు ఆగస్టు 17, 18 - 1 నుంచి 50,000 20, 21 - 50,001 నుంచి 1,00,000 22, 23 - 1,00,001 నుంచి 1,50,000 24, 25 - 1,50,001 నుంచి చివరి ర్యాంకు(2,03,000) 26 - 1 నుంచి 1,00,000 ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం 27 - 1,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం 30 - సీట్ల కేటాయింపు సెప్టెంబరు 1 - కాలేజీల్లో రిపోర్టు, తరగతులు ప్రారంభం వెబ్ ఆప్షన్లకు వన్‌టైమ్ పాస్వర్డ్ వెబ్ ఆప్షన్ల నమోదుకు వీలుగా ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా వన్‌టైమ్ పాస్వర్డ్ ఇవ్వనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో విద్యార్థి మొబైల్ నంబర్ తీసుకుంటారు. ఆప్షన్లు ఇచ్చే సమయంలో విద్యార్థి లాగిన్ కాగానే అతని మొబైల్‌కు పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. దాని ఆధారంగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆ పాస్వర్డ్ 15 నిమిషాలపాటు పని చేస్తుంది. ఆ సమయంలోగా ఇచ్చుకున్న ఆప్షన్లు వెంటనే సేవ్ అవుతాయి. నిర్ణీత సమయం పూర్తికాగానే ఆ వెబ్సైట్ నుంచి లాగ్ అవుట్ మెసేజ్ వస్తుంది. విద్యార్థి మళ్లీ లాగిన్ అయితే మరో పాస్వర్డ్ మొబైల్‌కి వస్తుంది. దాని ఆధారంగా ఆప్షన్ల పేజీలోకి వెళ్లి మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ విధానంతో ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు, దళారులు మోసాలు తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. విద్యార్థికి ఎలాంటి అనుమానం కలిగినా మరో పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి మళ్లీ మార్పులు చేసుకోవచ్చు. అలాగే 26, 27 తేదీల్లో మరోసారి ఆప్షన్లను సరిచూసుకోవాలి. అవసరమైతే తుది మార్పులు చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ
రాష్ట్రంలో రేపట్నుంచి ‘ఎంసెట్’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 23 వరకు ప్రక్రియ పూర్తి.. తర్వాతే ఆప్షన్లు ఎంసెట్ ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్ రెండు రాష్ట్రాల్లో విడివిడిగా వెరిఫికేషన్.. ఉమ్మడిగా ప్రవేశాలు.. నేడు ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తేదీల ఖరారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. గురువారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 వరకూ ఇది కొనసాగనుంది. రెండు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ వేర్వేరుగా జరుగుతున్నప్పటికీ.. వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపును మాత్రం ఉమ్మడిగానే చేపట్టాలని తెలంగాణ, ఏపీ ఉన్నత విద్యా మండళ్లు దాదాపుగా అంగీకారానికి వచ్చాయి. మొత్తానికి సుప్రీం ఆదేశాల మేరకు ఈ నెల 31లోగానే ప్రవేశాలను పూర్తి చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ కౌన్సెలింగ్ ప్రక్రియను మొదలుపెడుతూ ఎంసెట్ ప్రవేశాల కమిటీ మిగతా మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తేదీలను ఖరారు చేసేందుకు బుధవారం నాడు ఇరు రాష్రాల ఉన్నత విద్యా మండళ్లతో సంయుక్త సమావేశం నిర్వహిస్తామని ప్రకటి ంచింది. దీనికి హాజరు కావాలంటూ తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్‌కు లేఖ రాసినట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి కూడా వెల్లడించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల్లోనూ గడువులోగా పూర్తి చేస్తాం: పాపిరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ నాటికి రెండు రాష్ట్రాల్లోనూ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై విద్యా శాఖ అధికారులు వికాస్ రాజ్, శైలజా రామయ్యార్‌తో మంగళవారం ఆయన సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23 నాటికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేస్తామని, తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఇందుకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఈ విషయంలో ఏపీ ఉన్నత విద్యా మండలితో మాట్లాడి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. నోటిఫికేషన్ వివరాలు తెలంగాణలో రోజుకు 25 వేల మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ కోకన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఎంసెట్-2014 (ఎంపీసీ విభాగం) పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ర్యాంకుల వారీగా నిర్ణీత తేదీల్లో తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల వివరాలను ఎంసెట్ వెబ్సైట్లో (https://eamcet.nic.in) అందుబాటులో ఉంచారు. రోజూ ఉదయం 9 గంటలకు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెరిఫికేషన్‌కు విద్యార్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు మూడు సెట్ల కాపీలను తీసుకురావాలి. ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, ఎస్ఎస్సీ తత్సమాన మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, జనవరి ఒకటి 2014 తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్/ఎన్సీసీ/స్పోర్ట్స్ తదితర సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాలి. ఓసీ బీసీ అభ్యర్థులు రూ. 600, ఎస్సీ, ఎస్టీలు రూ. 300 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. కాలేజీల ట్యూషన్ ఫీజుల వివరాలు, కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండే సీట్ల వివరాలను వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు ముందు ప్రకటిస్తారు. విద్యార్థుల ఆప్షన్లను బట్టి సీట్లను కేటాయిస్తారు. కాగా, వికలాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్/గేమ్స్ తదితర కేటగిరీల వారికి హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్‌లోనే ఈ నెల 14, 16, 17, 18 తేదీల్లో వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్ల తేదీలను తర్వాత వెల్లడిస్తారు. -
కౌన్సెలింగ్ మేమే నిర్వహిస్తాం!
సుప్రీం తీర్పు నేపథ్యంలో తెలంగాణ సర్కారు కసరత్తు సీఎం కేసీఆర్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ భేటీ ఉమ్మడిగానే ఆప్షన్లు, ప్రవేశాలు తప్పదంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను తామే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీం తీర్పునకు లోబడి, రాష్ర్ట విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియను తామే చేపట్టాలని తాజాగా నిర్ణయానికి వచ్చింది. పైగా ఎంసెట్ పరీక్షను నిర్వహించిన జేఎన్టీయూహెచ్ తమ పరిధిలోనే ఉన్నందున తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే కౌన్సెలింగ్ చేపట్టాలని అభిప్రాయపడుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అధికారులతో చర్చించేందుకు విద్యా శాఖ అధికారులు సిద్దమవుతున్నారు. వీలైతే మంగళవారమే షెడ్యూల్ జారీ చేసి.. వెంటనే సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించాలని కూడా భావిస్తున్నారు. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వేర్వేరుగా చేపట్టినా, కౌన్సెలింగ్ ఎవరు నిర్వహించినా వెబ్ ఆప్షన్లను మాత్రం ఉమ్మడిగానే ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఒకే పరీక్ష ద్వారా ఉమ్మడి ర్యాంకులు కేటాయించినందున ఈ విధానం తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. పైగా విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలన్నా.. ఉమ్మడిగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ నెలాఖరులోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో సోమవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే నిర్వహిస్తామని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణలోనూ కౌన్సెలింగ్ చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి కూడా ప్రకటించారు. తెలంగాణ అధికారులతో సమావేశమై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను ఖరారు చేస్తామని చెప్పారు. వీలైతే ఈనెల 14 నుంచి వెరిఫికేషన్ ప్రారంభించి.. ఈ నెల 23లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. మొదటి దశ కౌన్సెలింగ్‌ను ఈ నెల 31లోగా పూర్తి చేసి తరగతులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజులుగా దాదాపు 10 వేల మంది వెరిఫికేషన్ పూర్తయిందని, తెలంగాణలోనూ రోజుకు పది లేదా 20 వేల మందికి వెరిఫికేషన్ చేస్తే 23వ తేదీ నాటికి వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని వివరించారు.