ఇక ఉమ్మడిగా ఎంసెట్ ప్రవేశాలు | Web options from 17 august for EMCET counselling | Sakshi
Sakshi News home page

ఇక ఉమ్మడిగా ఎంసెట్ ప్రవేశాలు

Published Thu, Aug 14 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

ఇక ఉమ్మడిగా ఎంసెట్ ప్రవేశాలు

ఇక ఉమ్మడిగా ఎంసెట్ ప్రవేశాలు

  • 17 నుంచి వెబ్ ఆప్షన్లు
  •  26, 27 తేదీల్లో తుది మార్పులకు అవకాశం
  •  30న సీట్ల కేటాయింపు, 1 నుంచి తరగతులు షెడ్యూల్ ప్రకటన.. 
  •  
     సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు గాడిన పడింది! ఇరు రాష్ట్రాల్లో వేర్వేరుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్నప్పటికీ ఉమ్మడిగానే ప్రవేశాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నుంచే ఉమ్మడి కార్యాచరణ మొదలుకానుంది. ఈ నెల 17 నుంచే రెండు రాష్ట్రాల విద్యార్థులకు కలిపి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కమిటీ తాజాగా ప్రకటిం చింది. 25వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో బుధవారం ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. 
     
    అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు ఇందులో పాల్గొనలేదు. ప్రవేశాల కమిటీ కన్వీనర్ అజయ్‌జైన్, కోకన్వీనర్ శైలజా రామయ్యార్ మాత్రమే పలు అంశాలపై చర్చించారు. చివరకు ఉమ్మడిగా వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభ తేదీలను ఖరారు చేశారు. అనంతరం ఈ వివరాలను ప్రకటించారు. వెబ్ ఆప్షన్ల తర్వాత  ఈ నెల 26, 27 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పిస్తామని, 30వ తేదీన సీట్లను కేటాయిస్తామని, వచ్చే నెల 1వ తేదీన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రవేశాల కమిటీ వెల్లడించింది. 
     
    ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో గురువారం నుంచి 23వ తేదీ వరకు రాష్ర్ట వ్యాప్తంగా 23 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్ జరుగుతుందని కమిటీ తెలిపింది. ఇదే సమయంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 30న సాయంత్రం 6 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో(https://eamcet.nic.in) సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటిస్తారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయి సీట్ల కేటాయింపు లేఖను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
     
     తెలంగాణలో 315.. ఏపీలో 350 కాలేజీలు
     తెలంగాణలో 315 ఇంజనీరింగ్ కాలేజీలకు, ఆంధ్రప్రదేశ్‌లో 350 కాలేజీలకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన అఫిలియేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని ఈనెల 15వ తేదీ నాటికి ఇది పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆ వెంటనే విద్యార్థులకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వీలుగా ఆయా కాలేజీలు, వాటిలోని సీట్ల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఇక మైనారిటీ కాలేజీలు, సొంత ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే కాలేజీలకు సంబంధించిన వివరాలు తమకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నుంచి రావాల్సి ఉందన్నారు. ఈ నెల 15 లేదా 20వ తేదీ నాటికి వీటిపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు ఇప్పటివరకు పూర్తయిన 8 ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఉమ్మడి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. వీటిలో నాలుగింటి చొప్పున పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాంకేతిక విద్యా కమిషనర్లు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఒకరు కన్వీనర్‌గా ఉంటే.. మరో రాష్ర్ట అధికారి కోకన్వీనర్‌గా ఉంటారు. మరో నాలుగు రోజుల్లో ఐసెట్, ఈసెట్ ప్రవేశాలకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. 
     
     వెబ్ ఆప్షన్ల షెడ్యూల్  తేదీ ర్యాంకు
    •  ఆగస్టు 17, 18   -   1 నుంచి 50,000
    •  20, 21 -  50,001 నుంచి 1,00,000
    •  22, 23 -  1,00,001 నుంచి 1,50,000
    •  24, 25 -  1,50,001 నుంచి చివరి ర్యాంకు(2,03,000)
    •  26 -  1 నుంచి 1,00,000 ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం
    •  27 -  1,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం
    •  30 -  సీట్ల కేటాయింపు 
    •  సెప్టెంబరు 1   -  కాలేజీల్లో రిపోర్టు, తరగతులు ప్రారంభం
     
     వెబ్ ఆప్షన్లకు వన్‌టైమ్ పాస్‌వర్డ్
     వెబ్ ఆప్షన్ల నమోదుకు వీలుగా ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా వన్‌టైమ్ పాస్‌వర్డ్ ఇవ్వనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో విద్యార్థి మొబైల్ నంబర్ తీసుకుంటారు. ఆప్షన్లు ఇచ్చే సమయంలో విద్యార్థి లాగిన్ కాగానే అతని మొబైల్‌కు పాస్‌వర్డ్ మెసేజ్ వస్తుంది. దాని ఆధారంగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆ పాస్‌వర్డ్ 15 నిమిషాలపాటు పని చేస్తుంది. ఆ సమయంలోగా ఇచ్చుకున్న ఆప్షన్లు వెంటనే సేవ్ అవుతాయి. నిర్ణీత సమయం పూర్తికాగానే ఆ వెబ్‌సైట్ నుంచి లాగ్ అవుట్ మెసేజ్ వస్తుంది. విద్యార్థి మళ్లీ లాగిన్ అయితే మరో పాస్‌వర్డ్ మొబైల్‌కి వస్తుంది. దాని ఆధారంగా ఆప్షన్ల పేజీలోకి వెళ్లి మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ విధానంతో ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు, దళారులు మోసాలు తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. విద్యార్థికి ఎలాంటి అనుమానం కలిగినా మరో పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి మళ్లీ మార్పులు చేసుకోవచ్చు. అలాగే 26, 27 తేదీల్లో మరోసారి ఆప్షన్లను సరిచూసుకోవాలి. అవసరమైతే తుది మార్పులు చేసుకుని సబ్‌మిట్ చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement