సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్‌సైట్‌లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమో
దు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు.
పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్‌ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్‌ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు.
జీఎస్‌ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులు
శాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్‌ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్‌ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు.
ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్‌ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment