పాఠశాల విద్య పరిస్థితి ఏమిటి? | TS Higher Education Council Plan To Comprehensive Study On School Education Situation | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్య పరిస్థితి ఏమిటి?

Published Tue, Dec 31 2019 2:11 AM | Last Updated on Tue, Dec 31 2019 4:41 AM

TS Higher Education Council Plan To Comprehensive Study On School Education Situation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాఠశాల విద్యలో ఎన్నో అంతరాలు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు, ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాల్లో ఒక్కో రకమైన విద్యా విధానం అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లోని స్థితిగతులు, విద్యా విధానం, ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు, సదుపాయాలు, టీచర్లకు జీతభత్యాలు, విద్యార్థులకు ప్రయో జనాలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనానికి ఉన్నత విద్యామండలి సిద్ధం అవుతోంది. తద్వారా భవిష్యత్తు కార్యాచరణకు అది ఉపయోగపడేలా చూడాలన్న భావనతో ఈ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌తో (సెస్‌) ఒప్పందం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం ఎలా ఉందన్న వివరాలు మండలి వద్ద ఉన్నాయి. కానీ పాఠశాల విద్యారంగంపై అధికారిక అధ్యయనాలేవీ లేవన్న ఉద్దేశంతో ఇందుకు సిద్ధం అవుతున్నట్లు వివరించారు.

(చదవండి : ఫీజులకు 2,042 కోట్లు)

జనవరిలో నెలలో ఒప్పందం..
పాఠశాల విద్యపై సమగ్ర అధ్యయనం కోసం జనవరిలో సెస్‌తో ఎంవోయూ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఒప్పందం అనంతరం చేసే అధ్యయనంలో సమగ్ర సమాచారం సేకరించనుంది. 2020 ఏప్రిల్‌ నాటికి ఈ అధ్యయనం పూర్తి చేయాలని యోచిస్తోంది. వీలైతే అధ్యయన నివేదిక ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21)లో ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటే ప్రభుత్వం తీసుకుంటుందనే ఆలోచనతో ఉన్నత విద్యామండలి సర్వే చేయించేందుకు సిద్ధమైంది. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులతోపాటు విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలు, విద్యాసంస్థల యాజమాన్యాలను సెస్‌ సంప్రదించనుంది. ఎక్కువ మంది నుంచి అభిప్రాయాలు తీసుకొని సమగ్ర నివేదికను రూపొందించనుంది.

ప్రమాణాలు, సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి..
ఈ అధ్యయనంలో పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలు, విద్యార్థుల ఉత్తీర్ణత, వారి సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటోంది. అందుకు కారణాలు ఏమిటి? ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాల్లో తేడా ఎందుకు వస్తోంది? ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యార్థుల ఉత్తీర్ణత కంటే గురుకులాల్లో ఉత్తీర్ణత ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటనే అంశంపై శాస్త్రీయ కోణంలో విశ్లేషణ ఉండేలా చూడాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఉత్తీర్ణత, సామర్థ్యాలే కాకుండా క్రీడలు, సాంçస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రావీణ్యం, ఉత్సాహం తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు. ఉత్తీర్ణతలో ప్రధానంగా తక్కువ మంది విద్యార్థులున్న చోట పరిస్థితి ఎలా ఉంది? అదే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నచోట ఎంత మంది ఉత్తీర్ణులు అవుతున్నారనే విషయాన్ని బేరీజు వేయనున్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు, చెల్లించే వేతనాలు, వాటి ప్రభావం, విద్యార్థులకు కల్పించే సదుపాయాల ప్రభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. వాటిన్నింటి ద్వారా రాష్ట్ర సమగ్ర పాఠశాల విద్యా నివేదికను సిద్ధం చేయించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement