center for economic and social studies
-
పాఠశాల విద్య పరిస్థితి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యలో ఎన్నో అంతరాలు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాల్లో ఒక్కో రకమైన విద్యా విధానం అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లోని స్థితిగతులు, విద్యా విధానం, ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు, సదుపాయాలు, టీచర్లకు జీతభత్యాలు, విద్యార్థులకు ప్రయో జనాలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనానికి ఉన్నత విద్యామండలి సిద్ధం అవుతోంది. తద్వారా భవిష్యత్తు కార్యాచరణకు అది ఉపయోగపడేలా చూడాలన్న భావనతో ఈ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్‌తో (సెస్) ఒప్పందం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం ఎలా ఉందన్న వివరాలు మండలి వద్ద ఉన్నాయి. కానీ పాఠశాల విద్యారంగంపై అధికారిక అధ్యయనాలేవీ లేవన్న ఉద్దేశంతో ఇందుకు సిద్ధం అవుతున్నట్లు వివరించారు. (చదవండి : ఫీజులకు 2,042 కోట్లు) జనవరిలో నెలలో ఒప్పందం.. పాఠశాల విద్యపై సమగ్ర అధ్యయనం కోసం జనవరిలో సెస్‌తో ఎంవోయూ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఒప్పందం అనంతరం చేసే అధ్యయనంలో సమగ్ర సమాచారం సేకరించనుంది. 2020 ఏప్రిల్ నాటికి ఈ అధ్యయనం పూర్తి చేయాలని యోచిస్తోంది. వీలైతే అధ్యయన నివేదిక ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21)లో ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటే ప్రభుత్వం తీసుకుంటుందనే ఆలోచనతో ఉన్నత విద్యామండలి సర్వే చేయించేందుకు సిద్ధమైంది. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులతోపాటు విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలు, విద్యాసంస్థల యాజమాన్యాలను సెస్ సంప్రదించనుంది. ఎక్కువ మంది నుంచి అభిప్రాయాలు తీసుకొని సమగ్ర నివేదికను రూపొందించనుంది. ప్రమాణాలు, సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి.. ఈ అధ్యయనంలో పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలు, విద్యార్థుల ఉత్తీర్ణత, వారి సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటోంది. అందుకు కారణాలు ఏమిటి? ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాల్లో తేడా ఎందుకు వస్తోంది? ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థుల ఉత్తీర్ణత కంటే గురుకులాల్లో ఉత్తీర్ణత ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటనే అంశంపై శాస్త్రీయ కోణంలో విశ్లేషణ ఉండేలా చూడాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఉత్తీర్ణత, సామర్థ్యాలే కాకుండా క్రీడలు, సాంçస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రావీణ్యం, ఉత్సాహం తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు. ఉత్తీర్ణతలో ప్రధానంగా తక్కువ మంది విద్యార్థులున్న చోట పరిస్థితి ఎలా ఉంది? అదే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నచోట ఎంత మంది ఉత్తీర్ణులు అవుతున్నారనే విషయాన్ని బేరీజు వేయనున్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు, చెల్లించే వేతనాలు, వాటి ప్రభావం, విద్యార్థులకు కల్పించే సదుపాయాల ప్రభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. వాటిన్నింటి ద్వారా రాష్ట్ర సమగ్ర పాఠశాల విద్యా నివేదికను సిద్ధం చేయించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. -
గ్లోబల్ సిటీగా హైదరాబాద్
►రక్షణకు ప్రత్యేక చర్యలు ►జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ►‘పబ్లిక్ సేప్టీ ►ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్’పై సదస్సు ►హాజరైన వివిధ శాఖల అధికారులు సనత్‌నగర్: ‘మన నగరం-మన రక్షణ-మన బాధ్యత’ నినాదంతో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రతి సిటిజన్ రక్షణ బాధ్యత తనదిగా భావించే విధంగా వినూత్న కార్యక్రమాల రూపకల్పనతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు. అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో గురువారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ‘పబ్లిక్ సేప్టీ (మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్-2013 అండ్ రూల్స్-2014’పై వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ హాజరయ్యారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, పట్టణ ప్రణాళికాధికారులు, అగ్నిమాపక, ఎక్సైజ్, ఆర్టీసీ, విద్యాశాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొని పబ్లిక్ సేప్టీ కోసం తీసుకోవాల్సిన అంశాలపై అభిప్రాయాలను వెలిబుచ్చారు. అధికారులు మాట్లాడుతూ.. నగరంలో అగ్ని ప్రమాదం జరిగితే కనీసం ఫైరింజన్ కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, చాలా వ్యాపార, వాణిజ్య సముదాయాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు లేవన్నారు. నిర్మాణ అనుమతుల సందర్భంలోనే రక్షణకు సంబంధించి అన్ని కోణాలను పరిశీలించాలని నిర్ణయించారు. పోలీసింగ్ వ్యవస్థ నిఘాతో పాటు నగరంలోని ప్రజల భద్రతపై పూర్తిస్థాయి చైతన్యం తీసుకురావాలన్నారు. ఆర్టీసీపరంగా ఎంజీబీఎస్, జూబ్లీ, పికెట్‌తో పాటు ఐటీ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు రోనాల్డ్ రోజ్, సత్యనారాయణతో పాటు డిప్యూటీ కమిషనర్లు సోమరాజు, విజయ్‌రాజ్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలోని అధునాత సేఫ్టీ పరికరాలు ఆకట్టుకున్నాయి. ►‘పబ్లిక్ సేప్టీ (మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ కింద నగరంలో ముందస్తుగా లక్ష కెమెరాల ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ►చిన్నచిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్ వరకు లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చైతన్యం తీసుకురానున్నారు. రహదారులు, పబ్లిక్ ప్రాంతాలు, కూడళ్లలో ప్రభుత్వం తరుపున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ►తాగి అల్లరి చేసేవారి ఆట క ట్టించేందుకు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం తాగేందుకు ఆస్కారం లేకుండా చేయనున్నారు. -
ఫలితమిచ్చిన పసిడి దిగుమతుల కట్టడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పసిడి, వెండి దిగుమతుల కట్టడికి చర్యలు ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడ్డాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ సోమవారం ఇక్కడ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే దాదాపు 2 శాతంగా క్యాడ్ (ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్- ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ మినహా దేశంలోకి వచ్చీ,పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) కట్టడి జరిగే పరిస్థితి నెలకొన్నట్లు ఆయన అన్నారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రంగరాజన్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 2012-13లో 88 బిలియన్ డాలర్లుగా ఉన్న కరెంట్ అకౌంట్‌లోటు, 2013-14లో 32 బిలియన్ డాలర్లకు (జీడీపీలో దాదాపు 2 శాతం) తగ్గిపోవడం ఆర్థికరంగానికి కలసివస్తున్న అంశమని సూచించారు. ఎల్ నినోపై ఇప్పుడే చెప్పలేం..: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీపై ఎల్ నినో ప్రభావం పడే అవకాశం ఉందన్న వార్తలపై అడిగిన ఒక ప్రశ్నకు రంగరాజన్ సమాధానం ఇస్తూ, ప్రభావం ఎలా ఉండబోతోందన్న అంశాన్ని కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమన్నారు. విద్యార్థులకు ప్రేమతో బోధించాలి: విద్యార్థులకు ప్రేమతో, చక్కగా అర్ధమయ్యేలా బోధించినప్పుడే అధ్యాపకుడు తన వృత్తికి న్యాయం చేసినట్లు అవుతుందని సెస్ప్రాంగణంలో 2014-15 బ్యాచ్ ఎంఫిల్. పీహెచ్డీ బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంగరాజన్ అన్నారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పటివరకు 100 మంది ఎంఫిల్, 70 మంది విద్యార్థులు పీహెచ్డీ పూర్తి చేసినట్లు సంస్థ డెరైక్టర్ ఎస్.గలాబ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.