ఇకపై సెమిస్టర్ విధానం
డిగ్రీ, పీజీ కోర్సుల్లో భారీ మార్పులు
హైదరాబాద్: డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో పలు మార్పులపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశ్, కళాశాల విద్య కమిషనర్ వాణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీబీసీఎస్ అమలుకు చేపట్టాల్సిన చర్యలు, రాష్ట్రంలో విద్యా సంస్థల్లో వాస్తవ పరిస్థితులు, అధ్యాపకుల కొరతపై జరిగిన చర్చల అనంతరం సీబీసీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయానికొచ్చారు.
కొత్త కోర్సులు, కొత్త సబ్జెక్టులు లేనట్టే..
ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులు, కోర్సుల్లోనే సీబీసీఎస్ వర్తింపచేయాలని, కొత్త కోర్సులు, కొత్త సబ్జెక్టులు ప్రస్తుతానికి పక్కన పెట్టాలని నిర్ణయించారు. కొత్త కోర్సులు, కొత్త సబ్జెక్టులు ప్రవేశ పెడితే కాలేజీల్లోనే కాకుండా యూనివర్సిటీల్లోనూ ఇబ్బందులు తప్పవని భావించారు. అందుకే ప్రస్తుతం డిగ్రీ కోర్సులో సివిల్స్‌కు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయనున్న నేపథ్యంలో.. ఆ సిలబస్‌లోనే 2015-16 విద్యా సంవత్సరం నుంచే సీబీసీఎస్ విధానం వర్తింపజేయాలని, ఇందులో భాగంగా అన్ని రకాల డిగ్రీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం, పరీక్షల ఫలితాల్లో గ్రేడింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయానికొచ్చారు. గతంలో యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు, ఇతర డిగ్రీ కాలేజీల్లో దశల వారీగా అమలు చేయాలని భావించినా అది సాధ్యం కాదని తేల్చారు. రాష్ట్రంలోని 1,200కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, యూనివర్సిటీల్లో ఈ విధానం అమలు చేయనున్నారు. సీబీసీఎస్‌లోని కోర్ సబ్జెక్టుల్లోనే (ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులు) దీన్ని ప్రవేశపెట్టాలని, మరో రెండు అంశాలైన ఎలక్టివ్, ఫౌండేషన్ సబ్జెక్టుల విషయాన్ని తరువాత పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే సీబీసీఎస్ అమలుకు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొన్న కోర్సులు, సబ్జెక్టులు కాకుండా రాష్ట్రంలో ఉన్న కోర్సుల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నోడల్ కాలేజీలను ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని కాలేజీల్లో సీబీసీఎస్ అమలును అవి పర్యవేక్షి ంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే అటానమస్ కాలేజీల ఏర్పాటు కోసం ప్రోత్సాహకాలు అందించాలన్న అభిప్రాయానికి వచ్చారు. సెమిస్టర్ విధానంలో సమస్యలు ఉంటాయని, అందుకే జిల్లాకో పరీక్షల విభాగం ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.