సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రవేశాల కమిటీ ఏర్పా ట్లు చేసింది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను గురువారం https//tseamcet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను వెబ్‌సైట్ లో పొందొచ్చని తెలిపింది. వెరిఫికేషన్ పూర్తయిన వారు 28 నుంచి వచ్చే నెల 5 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని పేర్కొంది. వెబ్‌ఆప్షన్ల ప్రారంభం నాటికి కాలేజీల వారీగా సీట్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు వచ్చే నెల 8న మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
సీట్లు పొందిన వారు వచ్చే నెల 8 నుంచి 12 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించడంతో పాటు వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయా లని పేర్కొంది. రెండో దశ కౌన్సెలింగ్‌ను జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని పేర్కొంది. మూడో దశ కౌన్సెలింగ్‌ను ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు (జోసా ఆధ్వర్యంలో) పూర్తయ్యాక నిర్వహించాలని భావిస్తోంది. ఇంటర్నల్ స్లైడింగ్‌ను ప్రవే శాల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించనుంది.
రోజూ నాలుగు విడతలు..
ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఏయే తేదీల్లో ఏయే ర్యాంకుల వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్న వివరాలను ప్రకటించింది. రోజూ నాలుగు విడతలుగా (ఉదయం 9, ఉదయం 11.30, మధ్యా హ్నం 2, మధ్యాహ్నం 3.30కి బ్యాచ్‌ల వారీగా) వెరిఫికేషన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక కేటగిరీల వారికి మాసబ్ ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్‌లో వెరిఫికేషన్ ఉంటుందని, తేదీల వారీ వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొంది.
తేదీల వారీగా షెడ్యూలు..
28న: 1వ ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు వరకు
29న: 10,001 నుంచి 25 వేల ర్యాంకు వరకు
30న: 25,001 నుంచి 40 వేల ర్యాంకు వరకు
31న: 40,001 నుంచి 54 వేల ర్యాంకు వరకు
జూన్ 1న: 54,001 నుంచి 68వేల ర్యాంకు వరకు
2న: 68,001 నుంచి 82 వేల ర్యాంకు వరకు
3న: 82,001 నుంచి చివరి ర్యాంకు వరకు.
ఫీజు ఎలా చెల్లించాలంటే..
విద్యార్థులు https.//tseamcet.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు ఆప్షన్‌ను నొక్కాలి.
♦ ఆ తర్వాత విద్యార్థికి ఎంసెట్ హాల్‌టికెట్‌లో ఇచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్, టెన్త్ మెమోలో పేర్కొన్న పుట్టిన తేదీ, ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత విద్యార్థికి సంబంధించిన ప్రాథమిక సమాచారం మొబైల్ నంబర్, ఈ–మెయిల్, మీసేవా సెంటర్ జారీ చేసిన కులం, ఆదాయం సర్టిఫికెట్ల అప్లికేషన్ నంబర్లను (వర్తించే వారు) ఎంటర్ చేయాలి.
♦ ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీలు రూ.600, ఇతరులు రూ.1,200 క్రెడిట్‌కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజుగా చెల్లించాలి. హెల్ప్‌లైన్ సెంటర్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించని వారిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అనుమతించరు.
♦ వెబ్‌సైట్‌నుంచి జిల్లా కాలేజీల జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వెబ్‌సైట్ నుంచి మాన్యువల్ ఆప్షన్ల ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. తల్లిదండ్రులతో చర్చించుకొని అందులో రాసుకోవాలి. తాము కోరుకునే కాలేజీలు, బ్రాంచీల్లో వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవాలి.
వెంట తీసుకెళ్లాల్సినవి..
అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ల జిరాక్స్ సెట్ ఎంసెట్ ర్యాంకు కార్డు, ఎంసెట్ హాల్‌టికెట్, ఆధార్ కార్డు, టెన్త్ మార్కుల మెమో, ఇంటర్మీడియట్ తత్సమాన మార్క్ కమ్ పాస్ సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, 2018 జనవరి 1, ఆ తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం (వర్తించేవారు), కుల ధ్రువీకరణ పత్రం (వర్తించేవారు), రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదువుకోని వారైతే వరుసగా ఇంటర్ నుంచి కింది తరగతి వరకు ఏడేళ్ల నివాస ధ్రువీకరణ పత్రం.
ఏపీ విద్యార్థులు కూడా పైన పేర్కొన్న సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో తెలంగాణలో 10 ఏళ్ల పాటు నివసించి ఉన్నట్లుగా నివాస ధ్రువీకరణ పత్రం సబ్మిట్ చేయా లి. ఇక్కడ చదువుకోని వారి ఉద్యోగుల పిల్లలైతే ఎంప్లాయర్ సర్టిఫికెట్ అందజేయాలి.
వెబ్ ఆప్షన్లు ఎలా ఇచ్చుకోవాలంటే...
♦ విద్యార్థులు సూచనలు పూర్తిగా చదవాక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
♦ వెబ్‌సైట్‌లోని క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింకు క్లిక్ చేసి పాస్ వర్డ్ జెనరేట్ చేసుకోవాలి.
♦ జెనరేట్ చేసుకున్న పాస్‌వర్డ్‌తో క్యాండిడేట్ లాగిన్‌లో వివరాలు నమోదు చేయాలి. విద్యార్థి మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఉపయోగించి లాగిన్ కావాలి.
♦ విద్యార్థులు జాగ్రత్తగా ఆర్డర్ ప్రకారం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను ఇచ్చుకోవాలి. నిర్ణీత తేదీల్లో విద్యార్థి ఎన్నిసార్లయినా ఆప్షన్లు మార్చుకోవచ్చు.
♦ ఆప్షన్లు ఇచ్చుకున్నాక సేవ్ చేయాలి. ఫైనల్ ప్రింటవుట్ తీసుకుని, లాగ్ అవుట్ చేయాలి.
♦ ఇళ్లు, ఇంటర్నెట్ కేంద్రం, హెల్ప్‌లైన్ కేంద్రాల నుంచి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
♦ ఇంటర్నెట్ సెంటర్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే అవి సేవ్ చేసుకున్నాక కచ్చితంగా లాగ్‌అవుట్ చేయాలి.
♦ సీట్ల కేటాయింపు వివరాలను జూన్ 8న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
Comments
Please login to add a commentAdd a comment