త్వరిత పొదుపుతో లక్ష్య సాధన
పిల్లల్ని సమాజంలో ఎవరికీ తక్కువ కాకుండా పెంచడానికి తాపత్రయపడతాం.
ఉన్నత చదువులు చదివించాలని కలలు కంటాం.
ఇలా చేయాలంటే దానికి చాలా మొత్తంలో డబ్బులు అవసరమౌతాయి.
ఈ విషయం మీద అవగాహన వున్నపుడు మనం పిల్లల భవిష్యత్తు కోసం ఎంత వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్చేయడం ప్రారంభిస్తాం.
నానాటికీ పెరుగుతున్న చదువుల వ్యయాలు...
నా చిన్నప్పుడు ఒక పెన్సిల్ ధర రూపాయి ఉంటే ఇప్పుడు అదే పెన్సిల్ ధర ఐదు రూపాయలుగా ఉంది. అలాగే పిల్లలు ఎదుగుతున్నకొద్దీ చదువుల ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో చదువుల ఖర్చు పెరుగుతూ వస్తోంది. మెడికల్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు చేయాలంటే ఖర్చు తడిసిమోపెడు అవుతోంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్లో 2005-07లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే రూ.3.16 లక్షలు ఖర్చవుతే, ఇప్పుడు అదే ప్రోగ్రామ్ చేయాలంటే రూ. 18.5 లక్షలు అవుతోంది. అంటే ఆ ప్రోగ్రామ్ చేయడానికి అయ్యే ఖర్చు పదేళ్లలో ఆరు రెట్లు పెరిగింది. చదువుల ఖర్చు వచ్చే రోజుల్లో కూడా పెరుగుతూనే ఉంటుంది. వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఏదైనా ఒక కోర్సు చేయడానికి రూ. 15 లక్షలు ఖర్చు అవుతుంటే.. అదే కోర్సు చేయడానికి 18 ఏళ్ల తర్వాత రూ.43 లక్షలు కావాల్సిన పరిస్థితి రావచ్చు.
సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే విద్యారంగంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. మీరు విద్యా రుణం తీసుకుంటే మేలేకానీ అది మీ అవసరాలన్నింటినీ కవర్ చేస్తే బాగుంటుంది. అలాగే పెద్ద మొత్తంలో లోన్ పేమెంట్ కట్టడం కూడా కొన్ని సార్లు కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలు పుట్టిన దగ్గరి నుంచి వారి చదువు కోసం సేవింగ్ చేయడం ప్రారంభిస్తే చాలా మంచిది. అప్పుడే పెరుగుతున్న ఖర్చులను భరించగలుగుతాం.
పెళ్లి ఖర్చు సంగతేంటి?
మీరు మీ పిల్లలకు ఘనంగా పెళ్లి చేయాలని అనుకుంటే మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇప్పుడు పెళ్లి చేయడానికి రూ.20 లక్షలు ఖర్చయితే అదే 18 ఏళ్ల తర్వాత పెళ్లి చేయాలంటే రూ.57 లక్షలు (వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంటే) కావాలి. కాబట్టి త్వరగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది.
అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే త్వరపడాలి..
మీ పిల్లల చదువుకు, పెళ్లికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమౌతాయి. దీని కోసం మీరు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మీకు ఐదేళ్లలో రూ. 40 లక్షలు కావాలంటే మీరు వార్షికంగా 10 శాతం రాబడినిచ్చే సాధనాల్లో ఇప్పుడు రూ.25 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే 10 శాతం రాబడితో మీరు 18 ఏళ్లలో రూ.40 లక్షలు పొందాలంటే నెలకు రూ.6,700 ఇన్వెస్ట్ చేస్తూ రావాలి. ఈ విధంగా నెలకు రూ.6,700 ఇన్వెస్ట్ చేస్తే మీరు పదేళ్ల తర్వాత రూ.13.72 లక్షలు పొందుతారు. తర్వాతి 8 ఏళ్లల్లో కూడా అదేతరహా పొదుపు కొనసాగిస్తే ఈ మొత్తం రూ.40.23 లక్షలు అవుతుంది.
- అనీశ్ ఖన్నా
చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్,ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్