మేమే నిర్వహించుకుంటాం
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై మంత్రి జగదీశ్‌రెడి
ఎంసెట్ ప్రవేశాల నోటిఫికేషన్‌తో మాకు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను మేమే నిర్వహించుకుంటాం.. ఈ విషయంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్‌తో మాకు సంబంధం లేదు. ఆ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, విద్యామండలి చైర్మన్ కలిసి ఆడుతున్న నాటకమిది..’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు కాలేజీలకు అనుమతులు ఇవ్వకముందే కౌన్సెలింగ్ ప్రక్రియ ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలోని కళాశాలలను తనిఖీ చేసి, అఫిలియేషన్ ఇచ్చిన అనంతరం ప్రవేశాల ప్రక్రియను చేపడతామని తెలిపింది.
ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలనకు ఎంసెట్ కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. గత నాలుగేళ్లలో ఎప్పుడూ ప్రవేశాలు ఆగస్టు కంటే ముందు జరగలేదని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి సీఎంకు తెలియజేశారు. ఉన్నత విద్యా మండలికి, ప్రభుత్వానికి మధ్య వివాదం వచ్చినపుడు... ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అవుతుందని ‘ఉన్నత విద్యామండలి చట్టం-1988’ సెక్షన్ 18 (2)లోనే ఉందని వివరించారు. ఏపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఉన్నత విద్యా మండలి తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎంతో దాదాపు మూడు గంటలపాటు చర్చించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా, ఇతర రాష్ట్ర విద్యార్థులకంటే తెలంగాణ విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్య అందిస్తామని... ఇందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని వివరించారు. కౌన్సెలింగ్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ఉన్నత విద్యా మండలి గందరగోళం సృష్టిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో సీట్లు కేటాయించే అధికారం ఏపీకి, ఏపీ ఉన్నత విద్యా మండలికి లేదని.. ఆంధ్రా ప్రభుత ్వం నిర్వహించే కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పారు. మండలి ప్రకటనపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా... ఇక్కడి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దనే ఉద్ధేశంతో చెబుతున్నామని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. జేఎన్‌టీయూ నుంచి అనుమతులు వచ్చాకే తెలంగాణలో కౌన్సెలింగ్ ఉంటుదన్నారు. సీఎంను కలిసిన వారిలో మంత్రితో పాటు విద్యాశాఖ అధికారులు ఉన్నారు.