‘భర్తీ’మే సవాల్
సాక్షి, కాకినాడ :ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో కళాశాలలను ఎంచుకునే కీలకమైన ‘వెబ్’ ఆప్షన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈనెల 25 వరకు జరిగే ఈ ప్రక్రియలో విద్యార్థులను రాబట్టి, సీట్లు భర్తీ చేసుకునేందుకు కళాశాలల యాజమాన్యాలు నానాతంటాలు పడుతున్నాయి. కొన్ని కళాశాలలు ఓపక్క విద్యార్థులకు, మరో పక్క ఇంటర్నెట్ సెంటర్లకు గాలం వేస్తున్నాయి. జిల్లాలోని 32 ఇంజనీరింగ్ కళాశాలల్లో అన్ని బ్రాంచ్‌లకు కలిపి 14 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఎంసెట్ ఉత్తీర్ణుల్లో కనీసం 30 శాతం ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకు క్యూకట్టినట్టు చెబుతున్నారు. 11 రోజుల క్రితం మొదలైన సర్టిఫికెట్ల పరిశీలనలో ఆదివారం నాటికి లక్షా 20 వేల వరకు ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన జరిపితే కేవలం 3,405 మంది మాత్రమే హాజరయ్యారు. లక్షా 20 వేల నుంచి 2 లక్షల మధ్య ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 23తో ముగియనుంది.
గతేడాదితో పోలిస్తే సర్టిఫికెట్ల పరిశీలనకు ఆశించిన స్పందన రాకపోవడం కళాశాలలను కలవరపెడుతోంది. గతేడాది 9 వేల సీట్లు భర్తీ కాగా ఈసారి ఆరేడువేలైనా భర్తీ కాని పరిస్థితి ఎదురు కావచ్చంటున్నారు. జేఎన్‌టీయూకే పరిధిలో ఏడుకళాశాలలు ప్రవేశాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. జేఎన్‌టీయూకే పరిధిలో 230 కళాశాలల్లో గతేడాది 55 వేల సీట్లుండగా ఈ ఏడాది ఆ సంఖ్య 60 వేలకు చేరింది. గతేడాది 10 వేల వరకు సీట్లు మిగిలిపోగా ఈసారి 20 వేలకుపైగా మిగిలిపోవచ్చని అధికారులే అంగీకరిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన వారిని ఏదోలా ఆకర్షించేందుకు కళాశాలలు ఆరాటపడుతున్నాయి.
కళాశాలల స్వాధీనంలో సర్టిఫికెట్లు..!
ఎలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చే వరకు సర్టిఫికెట్లు తీసుకునే అధికారం కళాశాలలకు లేకున్నా దళారీల సాయంతో పలు కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేసి సర్టిఫికెట్లను చేజిక్కించుకుంటున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పాస్‌వర్డ్ వచ్చే సెల్ నెంబర్ కూడా తమదే ఇచ్చి ఆ వచ్చిన పాస్‌వర్డ్‌తో తమ కళాశాలనే ఎంపిక చేయిస్తున్నారు. కొన్ని కళాశాలలు ఇంటర్నెట్ సెంటర్ల వారిని మచ్చిక చేసుకొని వారి ద్వారా విద్యార్థుల పాస్‌వర్డ్‌ను తస్కరిస్తూ తమ కళాశాలను ఆప్షన్‌గా పెట్టిస్తున్నారు. గతేడాది భీమవరం, ఏలూరు తదితర ప్రాంతాల్లో ఇలాంటి అవతవకలు బయటపడ్డాయి. ఈసారి యాజమాన్యాలు మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేస్తున్నాయి.
వెబ్ ఆప్షన్ల కోసం ఒక్కో విద్యార్థికి రూ.10 వేల చొప్పున ఇంటర్నెట్ సెంటర్లకు ఎరవేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థులకైతే టాబ్లెట్ పీసీ, ల్యాప్‌ట్యాప్ వంటి బహుమతులతో పాటు రూ.30 వేల వరకు నగదు ఎదురిచ్చి తమ వైపు తిప్పుకొంటున్నారు. రీయింబర్స్‌మెంట్ వర్తించని విద్యార్థులకు తమ కళాశాలలో చేరితే యూనిఫారమ్, బస్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజులతో పాటు మధ్యాహ్న భోజనం ఉచితం, తొలి ఏడాది ఫీజులు చెల్లించనవసరం లేదంటూ ఆకర్షిస్తున్నారు. అధ్యాపకులు, ఇతర సిబ్బందిని రంగంలోకి దింపి విద్యార్థులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వన్‌టైం పాస్‌వర్డ్ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాల వలలో పడకుండా తమ పిల్లలు కోరుకున్న కళాశాలల్లో కోరుకున్న బ్రాంచ్‌లు ఎంచుకునేలా సహకరించాలి. లేకుంటే వారి భవిష్యత్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.
వన్‌టైం పాస్‌వర్డ్ ఉన్నా..
గతంలో కౌన్సెలింగ్‌లో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు గుర్తించిన ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది స్క్రాచ్ కార్డును రద్దు చేసి వన్‌టైం పాస్‌వర్డ్‌ను ప్రవేశపెట్టింది. వెబ్ ఆప్షన్ కోసం ఇంటర్నెట్‌లో లాగిన్ అయితే ఒక వన్‌టైం పాస్‌వర్డ్ విద్యార్థి సెల్ నెంబర్‌కు వస్తుంది. ఆ పాస్‌వర్డ్ ఒకసారే లాగిన్ అవడానికి ఉపయోగ పడుతుంది. కళాశాల, బ్రాంచ్‌లను ఎంపిక చేసుకున్నాక లాగౌట్ అవ్వాలి. ఒకసారి లాగౌట్ అయ్యాక మళ్లీ లాగిన్ కు అవకాశం ఉండదు. అయితే పాస్‌వర్డ్ ఎవరికైనా ఇస్తే మాత్రం దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ విధానంలో డేటాను హ్యాకింగ్ చేసే అవకాశం ఉండదంటున్నా విద్యార్థులను తమవైపు తిప్పుకోవడం ద్వారా పాస్‌వర్డ్‌ను చేజిక్కించుకున్న యాజమాన్యాలు తమ కళాశాలలనే ఆప్షన్‌గా ఎంపిక చేస్తున్నాయి.