Web option
-
కేయూ పీజీ సెట్ వెబ్ ఆప్షన్ గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు గడువును పొడిగించామని కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. కొత్తగా కొన్ని కాలేజీలలో కోర్సులకు అనుమతి రావడం వల్ల వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈనెల 7వ తేదీన గడువు ముగియ గా, మళ్లీ పెంచామన్నారు. ఏదేని కారణాలతో కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చుకోలేకపోయిన వారికి కూడా అవకాశం ఉందన్నారు. ఈనెల 10,11, 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చామన్నారు. వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న విద్యార్థులకు ఈనెల 16వ తేదీన మొదటి దశలో సీట్ల కేటాయింపు జరగుతుందని తెలి పారు. సీట్లు పొందిన విద్యార్థులు వారికి కేటాయిం చిన కళాశాలల్లో ఈనెల 20వ తేదీలోపు ప్రవేశాలు పొందాలన్నారు. ఏ కోర్సులో సీటు పొందారో విద్యార్థుల సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ ద్వారా సమాచారం వస్తుందన్నారు. కేయూ వెబ్సైట్లో చూసుకోవాలన్నారు. -
వైవీయూ వెబ్ ఆప్షన్లకు 21వరకు గడువు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం రెండో విడత పీజీసెట్ కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు ఈనెల 21వ తేదీలోపు వెబ్ఆప్షన్స్ ఇచ్చుకోవాలని వైవీయూ ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఎస్.రఘునాథరెడ్డి తెలిపారు. 20, 21 తేదీల్లో వెబ్ఆప్షన్స్ ఇచ్చుకున్న వారికి తర్వాత కళాశాలలు కేటాయిస్తామని తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత సబ్జెక్టుల వారీగా మిగులు సీట్ల వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్య్లూ.వైవీయూడీఓఏ.ఇన్ నుంచి పొందవచ్చని సూచించారు. -
18 నుంచి వైవీయూ రెండో విడత కౌన్సెలింగ్
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కౌన్సెలింగ్ రెండోదశ సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో హాజరుకాని, ర్యాంకు సాధించిన విద్యార్థులు రెండోదశ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అదే విధంగా కళాశాల మార్పు కోరుకునే అభ్యర్థుల కూడా రెండోదశ కౌన్సెలింగ్‌లో ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని తెలిపారు. అదే విధంగా రెండవ విడత కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఈనెల 20, 21 తేదీల్లో వెబ్ఆప్షన్స్ ఇచ్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైవీయూడీఓఏ.ఇన్ వెబ్సైట్లో సంప్రదించవచ్చని తెలిపారు. -
పీజీఈసెట్ వెబ్ఆప్షన్స్ గడువు పొడిగింపు
హైదరాబాద్: పీజీఈసెట్-2015 వెబ్ఆప్షన్స్ గడువు సెప్టెబంర్ 2 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్‌బాబు సోమవారం తెలిపారు. మొత్తం 22 వేల సీట్లకు ఇంత వరకు 18,500 పైగా అభ్యర్థులు వెబ్ఆప్షన్స్ ఇచ్చినట్లు వివరించారు. సీట్లు సాధించిన అభ్యర్థుల తొలి జాబితాను సెప్టెంబర్ 7న ప్రకటించనున్నట్లు, 14 నుంచి ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల తరగతులు ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ తెలిపారు. -
విద్యార్థులు లేకున్నా కౌన్సెలింగ్!
• 26 నుంచి పీజీఈసెట్ వెబ్ ఆప్షన్లు • ఫీజులు ఇవ్వని ప్రభుత్వం... •సర్టిఫికెట్లను నిరాకరించిన కాలేజీలు •గందరగోళంగా విద్యార్థుల పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా వేల మంది విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎంటెక్‌లో చేరేందుకు పీజీఈసెట్ రాసిన విద్యార్థుల్లో అనేకమంది ఇప్పటికీ... బీటెక్ సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, లేదంటే డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఈనెల 26 నుంచి ఎంటెక్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల కమిటీ సిద్ధమైంది. దీంతో సర్టిఫికెట్లు తీసుకోలేని వారంతా విద్యా సంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పు చేసో, మరెలాగో కాలేజీలకు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకున్నవారు మాత్రం ఈనెల 14వరకు నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారు మాత్రమే ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి చదువుకొని, డబ్బు చెల్లించలేక సర్టిఫికెట్లను తెచ్చుకోలేని వారి గురించి మాత్రం ఎవరికీ పట్టడం లేదు. ఎంటెక్‌లో చేరేందుకు పీజీఈసెట్ రాసిన 43,776 మందిలో 38,882 మంది అర్హత సాధించారు. వారిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు 16 వేల మంది మాత్రమే. మిగతా వారిలో చాలా మంది కాలేజీలకు ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక.. వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయారు. దీనికితోడు ఈనెల 14వ తేదీ తరువాత సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారికి వెరిఫికేషన్ అవకాశం లేకపోవడంతో.. వారంతా ఆందోళన చెందుతున్నారు. సర్కారు ‘ఫీజు’ ఇవ్వని కారణంగా వేల మంది విద్యార్థులు విలువైన ఒక ఏడాది సమయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. -
‘భర్తీ’మే సవాల్
సాక్షి, కాకినాడ :ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో కళాశాలలను ఎంచుకునే కీలకమైన ‘వెబ్’ ఆప్షన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈనెల 25 వరకు జరిగే ఈ ప్రక్రియలో విద్యార్థులను రాబట్టి, సీట్లు భర్తీ చేసుకునేందుకు కళాశాలల యాజమాన్యాలు నానాతంటాలు పడుతున్నాయి. కొన్ని కళాశాలలు ఓపక్క విద్యార్థులకు, మరో పక్క ఇంటర్నెట్ సెంటర్లకు గాలం వేస్తున్నాయి. జిల్లాలోని 32 ఇంజనీరింగ్ కళాశాలల్లో అన్ని బ్రాంచ్‌లకు కలిపి 14 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఎంసెట్ ఉత్తీర్ణుల్లో కనీసం 30 శాతం ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకు క్యూకట్టినట్టు చెబుతున్నారు. 11 రోజుల క్రితం మొదలైన సర్టిఫికెట్ల పరిశీలనలో ఆదివారం నాటికి లక్షా 20 వేల వరకు ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన జరిపితే కేవలం 3,405 మంది మాత్రమే హాజరయ్యారు. లక్షా 20 వేల నుంచి 2 లక్షల మధ్య ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 23తో ముగియనుంది. గతేడాదితో పోలిస్తే సర్టిఫికెట్ల పరిశీలనకు ఆశించిన స్పందన రాకపోవడం కళాశాలలను కలవరపెడుతోంది. గతేడాది 9 వేల సీట్లు భర్తీ కాగా ఈసారి ఆరేడువేలైనా భర్తీ కాని పరిస్థితి ఎదురు కావచ్చంటున్నారు. జేఎన్టీయూకే పరిధిలో ఏడుకళాశాలలు ప్రవేశాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. జేఎన్టీయూకే పరిధిలో 230 కళాశాలల్లో గతేడాది 55 వేల సీట్లుండగా ఈ ఏడాది ఆ సంఖ్య 60 వేలకు చేరింది. గతేడాది 10 వేల వరకు సీట్లు మిగిలిపోగా ఈసారి 20 వేలకుపైగా మిగిలిపోవచ్చని అధికారులే అంగీకరిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన వారిని ఏదోలా ఆకర్షించేందుకు కళాశాలలు ఆరాటపడుతున్నాయి. కళాశాలల స్వాధీనంలో సర్టిఫికెట్లు..! ఎలాట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు సర్టిఫికెట్లు తీసుకునే అధికారం కళాశాలలకు లేకున్నా దళారీల సాయంతో పలు కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేసి సర్టిఫికెట్లను చేజిక్కించుకుంటున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పాస్వర్డ్ వచ్చే సెల్ నెంబర్ కూడా తమదే ఇచ్చి ఆ వచ్చిన పాస్‌వర్డ్‌తో తమ కళాశాలనే ఎంపిక చేయిస్తున్నారు. కొన్ని కళాశాలలు ఇంటర్నెట్ సెంటర్ల వారిని మచ్చిక చేసుకొని వారి ద్వారా విద్యార్థుల పాస్‌వర్డ్‌ను తస్కరిస్తూ తమ కళాశాలను ఆప్షన్‌గా పెట్టిస్తున్నారు. గతేడాది భీమవరం, ఏలూరు తదితర ప్రాంతాల్లో ఇలాంటి అవతవకలు బయటపడ్డాయి. ఈసారి యాజమాన్యాలు మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేస్తున్నాయి. వెబ్ ఆప్షన్ల కోసం ఒక్కో విద్యార్థికి రూ.10 వేల చొప్పున ఇంటర్నెట్ సెంటర్లకు ఎరవేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించే విద్యార్థులకైతే టాబ్లెట్ పీసీ, ల్యాప్‌ట్యాప్ వంటి బహుమతులతో పాటు రూ.30 వేల వరకు నగదు ఎదురిచ్చి తమ వైపు తిప్పుకొంటున్నారు. రీయింబర్స్మెంట్ వర్తించని విద్యార్థులకు తమ కళాశాలలో చేరితే యూనిఫారమ్, బస్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజులతో పాటు మధ్యాహ్న భోజనం ఉచితం, తొలి ఏడాది ఫీజులు చెల్లించనవసరం లేదంటూ ఆకర్షిస్తున్నారు. అధ్యాపకులు, ఇతర సిబ్బందిని రంగంలోకి దింపి విద్యార్థులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వన్‌టైం పాస్వర్డ్ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాల వలలో పడకుండా తమ పిల్లలు కోరుకున్న కళాశాలల్లో కోరుకున్న బ్రాంచ్‌లు ఎంచుకునేలా సహకరించాలి. లేకుంటే వారి భవిష్యత్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. వన్‌టైం పాస్వర్డ్ ఉన్నా.. గతంలో కౌన్సెలింగ్‌లో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు గుర్తించిన ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది స్క్రాచ్ కార్డును రద్దు చేసి వన్‌టైం పాస్‌వర్డ్‌ను ప్రవేశపెట్టింది. వెబ్ ఆప్షన్ కోసం ఇంటర్నెట్లో లాగిన్ అయితే ఒక వన్‌టైం పాస్వర్డ్ విద్యార్థి సెల్ నెంబర్‌కు వస్తుంది. ఆ పాస్వర్డ్ ఒకసారే లాగిన్ అవడానికి ఉపయోగ పడుతుంది. కళాశాల, బ్రాంచ్‌లను ఎంపిక చేసుకున్నాక లాగౌట్ అవ్వాలి. ఒకసారి లాగౌట్ అయ్యాక మళ్లీ లాగిన్ కు అవకాశం ఉండదు. అయితే పాస్వర్డ్ ఎవరికైనా ఇస్తే మాత్రం దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ విధానంలో డేటాను హ్యాకింగ్ చేసే అవకాశం ఉండదంటున్నా విద్యార్థులను తమవైపు తిప్పుకోవడం ద్వారా పాస్‌వర్డ్‌ను చేజిక్కించుకున్న యాజమాన్యాలు తమ కళాశాలలనే ఆప్షన్‌గా ఎంపిక చేస్తున్నాయి.