
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టడంలో తప్పేముందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్ తండ్రి అని, ఆయన గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని న్యాయస్థానం గుర్తుచేసింది. ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్సార్ ఫోటోను తొలగించాలని కోరుతూ టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆయన ఫోటోలను ఎందుకు పెట్టకూడదని, వైఎస్సార్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా? అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యాన్ని తాము విచారించబోమని, రెగ్యులర్ బెంచ్ వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా అడ్వకేట్ జరనల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇది పక్కా బినామీ పొలిటికల్ పిటిషన్ అని అన్నారు.
పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి చెందిన వ్యక్తి అని, ఆయన టీడీపీ సానుభూతి పరుడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘పిటిషనర్ టీడీపీతో విడదీయరాని అనుబంధం ఉన్న వ్యక్తి. టీడీపీతో రాజకీయ అనుబంధాన్ని ఇక్కడ తొక్కిపెడుతున్నారు. చంద్రబాబు హయాంలో పసుపురంగులో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినప్పుడు ఈయనకు చాలా సుఖంగా ఉంది. టీడీపీ అధికారానికి దూరంకాగానే పాపం ఈయన అంతరాత్మ క్షోభిస్తోంది.’ అని వాదించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించిన ప్రభుత్వ ప్రకటలను అడ్వకేట్ హైకోర్టుకు నివేదించారు. చంద్రబాబు, లోకేష్, నారాయణ, ఎన్టీఆర్ ఫొటోలు పెట్టారని తెలిపారు. మంత్రులు, ఇతర వ్యక్తుల ఫొటోలు ప్రకటనల్లో పెట్టుకోవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే తీర్పునిచ్చినిందని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment