సీఆర్‌డీఏ అధికారులపై ఏపీ మాజీ ఏఏజీ పొన్నవోలు మండిపాటు
హైకోర్టు వద్దని చెప్పినా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేత
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టీడీపీ
భవనాలను ఎప్పుడూ కూల్చలేదు
ప్రొవిజినల్ ఆర్డర్స్‌పై అధికారులు కూల్చివేత చేపట్టలేరు
కోర్టు చెప్పింది ఒకటి.. సీఆర్‌డీఏ చేసింది మరొకటి
అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా పోరాడతాం
సాక్షి, హైదరాబాద్ : తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చి వేయడం చట్ట విరుద్ధమని, హైకోర్టు ఉత్తర్వులున్నా లెక్క చేయకుండా వ్యవహరించారని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి రావడంతోనే టీడీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యహరిస్తోంది.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కార్యాలయాలు కట్టుకునేందుకు 2016లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 340 జీవో తెచ్చారు. దీని ప్రకారం 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎకరం వెయ్యి రూపాయల చొప్పున చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం భూములు పొందారు. పాలకులు మారిపోయినా చట్టం మాత్రం మారదు. అదే చట్ట ప్రకారం కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2 ఎకరాలు తీసుకుంది.
భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేశాం. ఈ ప్రభుత్వం రావడంతోనే మాకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. నోటీసుపై 10వ తేదీ అని ఉన్నా, మాకు ఇచ్చింది మాత్రం 15వ తేదీ. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి ఉపశమన ఆదేశాలు పొందాం. చట్ట ప్రకారమే ముందుకు సాగాలని న్యాయస్థానం సీఆరీ్డయేను ఆదేశించింది. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనితనంతో ఆ ఆదేశాలను తుంగలో తొక్కారు’ అని మండిపడ్డారు.
ప్రజావేదికతో సంబంధం లేదు
ప్రజా వేదికతో కొందరు పోలుస్తుండటం సరికాదని.. దానికి, దీనికి సంబంధం లేదని పొన్నవోలు తెలిపారు. ‘నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. అలా ఎవరు చేసినా అది పూర్తి చట్ట వ్యతిరేకం. అలా చేస్తే ప్రజలు ముంపు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే.. చట్ట ప్రకారం నాటి ప్రభుత్వం ముందుకు వెళ్లింది. అంతే తప్ప అందులో కక్ష పూరితం లేదు.
వైఎస్సార్‌సీపీకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణం చేసుకోవడం చట్ట వ్యతిరేకం కాదు. ఈ వివాదం ఇప్పుడు అధికారులకు, కోర్టుకు మధ్య అన్న విధంగా మారింది. అధికారంలో ఉండగా వైఎస్సార్‌సీపీ ఏ ఒక్క అధికారిని ప్రభావితం చేయలేదు. టీడీపీ కట్టుకున్న పార్టీ కార్యాలయాలను కూల్చలేదు. వారు పొందిన స్థలాలను వెనక్కు తీసుకోలేదు. ఐదేళ్లు హూందాగా వ్యవహరించింది. సామాన్యుడు నిర్మాణం కోసం ఎలా అనుమతి పొందుతాడో అలాగే వైఎస్సార్‌సీపీ ముందుకు వెళ్లింది. ఏదేమైనా చట్ట విరుద్ధంగా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకునేలా పోరాడతాం’ అని వివరించారు.
సీఆర్డీయే ప్రకటనలో అంశాలు వాస్తవం కాదు
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఈనెల 1వ తేదీనే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చామంటూ సీఆరీ్డయే పేరుతో ఒక ప్రకటన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందన్న విషయం మా దృష్టికి వచ్చిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే ఇందులోని అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఆరీ్డయే ప్రొవిజనల్ ఆర్డర్‌పై ఈనెల జూన్ 10వ తేదీ వేసి, మాకు జూన్ 15వ తేదీన ఇచ్చారు. నిన్న (శుక్రవారం) కోర్టులో దీనిపైనే వాదోపవాదాలు జరిగాయన్నారు. చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను మీ ముందు (మీడియా) ఉంచుతున్నామన్నారు.
కూల్చి వేయము అని కోర్టుకు చెప్పి..
విచారణ సందర్భంగా న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని అధికారులు చెప్పారని పొన్నవోలు తెలిపారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారన్నారు. రాత్రికి రాత్రే జేసీబీలు తీసుకొచ్చి కూల్చివేత చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సూర్యోదయానికి ముందు.. సూర్యాస్థమయానికి తర్వాత ఎలాంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టవద్దని హైకోర్టు ఫుల్ బెంచ్ ప్రభుత్వాలకు గతంలోనే తేల్చి చెప్పింది. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూల్చి వేయడానికి వీల్లేదు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవతలి వారి వాదనలు వినాల్సి ఉంటుంది.
అందుకు 15 రోజుల సమయం ఉంటుంది. అయినా ప్రభుత్వం ముందుకు వెళితే.. బాధితులు ట్రిబ్యునల్‌కు కూడా వెళ్లవచ్చు. ట్రిబ్యునల్‌లో మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అప్పుడు ల్యాండ్ వ్యాల్యూపై 20 శాతం ఫైన్ స్వీకరించాలి. అట్లా పర్మిషన్ తీసుకోకుండా కడితే శిక్షార్హులు. కూల్చి వేత అనేది ఆఖరి అస్త్రం. అది కూడా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే. ప్రొవిజినల్ ఆర్డర్ మీద కూల్చి వేయడం చట్ట వ్యతిరేకం. ఇది చట్ట ప్రకారం పాటించాలి్సన విధానం. కానీ, ఇలాంటివేవీ పాటించ లేదు. ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న నేనే కోర్టు ఆదేశాలను సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించా. సీఆర్‌డీఏ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. వారిపై సివిల్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరతాం’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment