
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ రేట్ల ఖరారుకు హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కమిటీ ఇప్పటికే ఓసారి సమావేశమైందని, త్వరలో మరోసారి సమావేశమవుతుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఫిబ్రవరి మొదటి వారంలో రేట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున, విచారణను అప్పటికి వాయిదా వేయాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి హైకోర్టు వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. సినిమా టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35తో సంబంధం లేకుండా, అంతకు ముందున్న విధంగానే ధరలు ఖరారు చేసుకోవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వీటిపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం జాయింట్ కలెక్టర్లను సంప్రదించిన తరువాతే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. సోమవారం ఈ అప్పీళ్లపై ధర్మాసనం మరోసారి విచారణ జరపగా.. ఏజీ శ్రీరామ్ టికెట్ రేట్ల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు ధర్మాసనానికి తెలిపారు. జాయింట్ కలెక్టర్లను సంప్రదించిన తరువాత టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలన్న కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని న్యాయవాది వీవీ సతీష్ చెప్పగా.. దరఖాస్తులు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లకు సూచిస్తామని ఏజీ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment