
సీఐల పదోన్నతిపై ఏజీతో చర్చించి నిర్ణయం
సీనియర్ ఐపీఎస్‌లకు కేసీఆర్ ఆదేశం
రంజాన్, బోనాలు బందోబస్తుపై సూచనలు
హైదరాబాద్: పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల పదోన్నతిపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అడ్వకేట్ జనరల్ (ఏజీ)తో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సీనియర్ ఐపీఎస్‌అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఫ్రీజోన్‌గా ఉన్నసమయంలో పదోన్నతులకు సంబంధించి రూపొం దించిన జాబితా రూపకల్పనలో తమకు అన్యాయం జరిగిందని కొందరు ఇన్‌స్పెక్టర్లు సుప్రింకోర్టుకు వెళ్లగా వీరందరికి పదోన్నతులను కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం అప్పటి ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయనిపక్షంలో కోర్టు ధిక్కరణకు తగిన చర్యలు తప్పవని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు ఈనెల 7న రాష్ట్రం తరఫున హాజరుకావలసిన విషయమై మంగళవారం డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిసనర్ మహేందర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సత్య నారాయణ తదితరులతో కేసీఆర్ చర్చించారు.
నిజానికి ఈ వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని. అయితే హైదరాబాద్ కు సంబంధించిన అధికారులు కూడా ఈ వివాదంలో ఉన్నారు కాబట్టి దీనిపై అడ్వకేట్ జనరల్ రామ కృష్ణా రెడ్డితో చర్చించి నిర్ణయించాలని కేసీఆర్ ఆదేశించారు. సిఐల పదోన్నతుల జాబితా రూపకల్పన క్రమ పద్దతిలో జరగక పోవడం వలన యాబై మందికి పైగాడీఎస్పీల పదోన్నతులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సీఎం దృస్టికి తీసుకు వచ్చారు. కాగా, హైదరాబాద్‌లో, తెలంగాణా జిల్లాలలో బోనాలు, రంజాన్ పండుగల సందర్భంగా అవాంఛనీయ సంఘటనల నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు.