న్యూఢిల్లీ: పోలీసు అధికారులు మోరల్ పోలీసింగ్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితుల నుంచి వస్తు తదితర రూపేణా ప్రతిఫలాలు ఆశించడం, డిమాండ్ చేయడం తగదంటూ హితవు పలికింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జె.కె.మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. సంతోష్ కుమార్ అనే సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగిస్తూ క్షమశిక్షణ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.
సంతోష్ 2001 అక్టోబర్ 26న అర్ధరాత్రి వడోదరలో నైట్ డ్యూటీ సందర్భంగా నిశ్చితార్థమైన ఓ జంట రోడ్డుపై వెళ్తుండగా ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలొచ్చాయి. తనకు కాబోయే భార్యతో కాసేపు గడుపుతానంటూ వెకిలిగా ప్రవర్తించాడని బాధితుడు మర్నాడు ఫిర్యాదు చేశాడు. అది నిజమని విచారణలో తేలడంతో అతన్ని డిస్మిస్ చేశారు. అతడు హైకోర్టులో సవాలు చేయగా, విధుల్లోకి తీసుకోవడంతో పాటు డిస్మిస్ కాలానికి 50 శాతం వేతనమివ్వాలని 2014లో కోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘దోషి తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. ఇంతా చేస్తే అతను లా అండ్ ఆర్డర్ పోలీస్ కాదు. వాళ్లయినా సరే, ఇలా మోరల్ పోలీసింగ్‌కు దిగకూడదు. భౌతిక తదితర ప్రతిఫలాలు డిమాండ్ చేయకూడదు’’ అని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment