అభిప్రాయం
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ మూడు చట్టాలు బాధితులకు అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ అలా ఉన్నట్టుగా అనిపించటం లేదు. అందుకు ఉదాహరణగా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)ను పేర్కొనవచ్చు.
ప్రాథమిక దృష్టితో చూసినప్పుడు నేర సమాచారం కాగ్నిజబుల్ అయితే ఎఫ్‌ఐఆర్‌ను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 154 ప్రకారం తప్పక నమోదు చేయాల్సిన బాధ్యత పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జిపై ఉంది. ఈ విషయంలో అతను తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకునే అవకాశం చట్టం అతనికి ఇవ్వలేదు. సమాచారంలో విశ్వసనీయత కనిపించటం లేదనే కారణం కానీ లేదా అవసరమైన వివరాలు లేవని కానీ ఎఫ్‌ఐఆర్‌ను విడుదల చేయకుండా ఉండే అవకాశం లేదు.
కేసు ప్రాథమిక దశలో సమాచారం అన్నదే నిర్ణయాత్మకమైన విషయం. అందులోని విశ్వసనీయత తీవ్రతను చూడాల్సిన అవసరం లేదు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్న విషయం తేలితే కేసును మూసివేసి, తుది నివేదికను కోర్టుకు సమర్పించవచ్చు. అవసరమని భావించినప్పుడు ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవచ్చు. ఎఫ్‌ఐఆర్‌ను విడుదల చేయటానికి విశ్వసనీయ సమాచారం అవసరం లేదు. అందుకు కావలసిన అంశాలు రెండే రెండు. మొదటిది– అది సమాచారం అయ్యుండాలి. రెండవది– అది కాగ్నిజబల్ అయిన సమాచారం అయిఉండాలి.
అయితే సుప్రీంకోర్టు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ (ఏఐఆర్ 2014 సుప్రీం కోర్టు 187) కేసులో కొన్ని సందర్భాలలో ప్రాథమిక విచారణ చేసే వెసులుబాటును పోలీసులకు కల్పించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ప్రాథమిక విచారణ గురించి ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా ప్రాథమిక విచారణ జరుపకూడదని కూడా ఎక్కడా నిషేధం లేదు. నిషేధం లేనంత మాత్రాన ప్రాథమిక విచారణ చేయవచ్చని అనుకోడానికి వీలు లేదు. కానీ సుప్రీంకోర్టు కొన్ని కేసులలో ప్రాథమిక విచారణ జరుపడానికి వెసులుబాటు కల్పించింది.
ప్రథమ సమాచార నివేదిక విడుదల చేయడానికైనా ముందు ఎంక్వయిరీ జరిపే నిబంధన ఏదీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో లేదు. లలిత కుమారి కేసు ప్రకారం కాగ్నిజబల్ నేర సమాచారం ఉన్నప్పుడు పోలీసులు విధిగా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాలి. ఎలాంటి విచారణనూ చేయడానికి వీలు లేదు. ఒకవేళ అందిన సమాచారంలో కాగ్నిజబల్ నేరం వెల్లడికానప్పుడు అది కాగ్నిజబల్ నేర సమాచారం ఔనా, కాదా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు ప్రాథమిక విచారణ చేయవచ్చు.
అంతే తప్ప మరే విషయంలో ప్రాథమిక విచారణ చేయడానికి వీలులేదు. ఎలాంటి కేసులలో ప్రాథమిక విచారణ జరుపాలో సుప్రీంకోర్టు నిర్దేశించింది. 1. వివాహ వివాదాలు/ కుటుంబ వివాదాలు 2.వాణిజ్య నేరాలు 3. వైద్య నిర్లక్ష్య కేసులు 4. అవినీతికి సంబంధించిన కేసులు 5. సమాచారం అందచేయటంలో తీవ్రమైన జాప్యం ఉన్నప్పుడు. ఈ ప్రాథమిక విచారణను పోలీసులు జరుపవచ్చు. విచారణ సమయాన్ని 15 రోజులుగా సుప్రీంకోర్టు నిర్దేశించింది.
చట్టం ఇంత స్పష్టంగా ఉన్నపుడే కేసు నమోదు చేసుకోవడానికి బాధితులు తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. అంతేకాదు కేసు నమోదు కోసం పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది. ఈ ప్రాథమిక విచారణను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ప్రముఖమైన ఉదాహరణ, పత్రికల్లో వచ్చిన ఉదాహరణ– ఒక వ్యక్తి బ్యాంక్ నుంచి పది కోట్ల రుణం తీసుకున్నాడు. అది కట్టలేదు. చివరికి బ్యాంక్ వాళ్ళు ఆ రుణం వసూలు చేయడానికి ఏజంట్లను నియమించుకున్నారు. ఈ పరిస్థితిని అధిగమించటానికి ఆ రుణం తీసుకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించి, ఒక ఫిర్యాదును బ్యాంక్ ఉన్నతాధికారుల మీద దాఖలు చేశాడు.
ప్రాథమిక విచారణ పేరుతో పోలీసులు ఆ అధికారులను తరచూ పిలుస్తూ ఆరు మాసాలు గడిపారు. ఆ ఉన్నత అధికారులకు కేసు భయం పట్టుకునేలా చేశారు. చివరికి బ్యాంక్ అధికారులు తక్కువ మొత్తానికి ఒకేసారి పరిష్కారాన్ని చేసుకున్నారు. దాని వల్ల బ్యాంక్ నష్ట పోయింది. రుణం తీసుకున్న వ్యక్తి లాభపడ్డాడు. ఈ ప్రాథమిక విచారణ సమయంలో అనుమానితుడిని పిలిచే అధికారం పోలీసులకు లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీసులు చేయాల్సింది రహస్య విచారణ. దాని పరిధి కూడా చిన్నది.
కాగ్నిజబల్ నేరం జరిగిందా, లేదా అన్న విషయం తెలుసుకోవడానికి మాత్రమే పోలీసులు విచారణ జరపాలి కానీ పోలీసులు సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన దానిని మించి ప్రాథమిక విచారణ పేరుతో ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తికి లాభం జరిగే విధంగా ప్రవర్తించారు. బ్యాంక్‌కు కోట్ల రూపాయల నష్టం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 41 ప్రకారం లేదా 160 ప్రకారం మాత్రమే అనుమానితులను పిలవడానికి అవకాశం ఉంది. కానీ ఎలాంటి అధికారం లేకుండానే పోలీసు అధికారులు ఈ కేసులో బ్యాంక్ ఉన్నత అధికారులను పిలిచి, ఫిర్యాదు చేసిన వ్యక్తికి లాభం కలిగేలా చేశారు.
ప్రాథమిక విచారణను పైవిధంగా జరుపడానికి అధికారం లేనప్పుడే పోలీసులు ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రాథమిక విచారణ జరుపచ్చని చట్టం నిర్దేశిస్తే ఇంకా ఎంత దుర్వినియోగం అవుతుందోనని అనిపిస్తుంది. ‘భారతీయ నాగరిక సురక్ష సంహిత 2024’ లోని 173 ప్రకారం పోలీసు అధికారులు 3 సంవత్సరాలు కానీ, అంతకు మించి కానీ, 7 సంవత్సరాల లోపు కానీ ఉన్న నేరాలలో పోలీసులు ప్రాథమిక విచారణ జరుపవచ్చు. అది కాగ్నిజబల్ నేర సమాచారం ఐనప్పటికి కూడా ఈ విచారణను పోలీసు అధికారి జరపటానికి అవకాశం ఉంది.
ఈ ప్రాథమిక విచారణ చేయడానికి పోలీస్ అధికారి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అతను ఈ అనుమతిని ఎంతకాలంలో ఇవ్వాలి అన్న విషయం గురించి చట్టంలో ఏమీ చెప్పలేదు. ఆ అనుమతి కోసం కూడా బాధితులు ఆ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రాథమిక విచారణను చేయడానికి అనుమతిస్తే... పోలీస్ అధికారి విచారణను 14 రోజుల్లో పూర్తి చేయాలి.
ఈ విచారణ లలిత కుమారి కేసులో సుప్రీం కోర్టు చెప్పిన విధంగా కాదు. కేసులో ప్రాథమికంగా చూసినప్పుడు బలం ఉందా, లేదా అని అనిపించినప్పుడు విచారణ జరుపవచ్చు. కేసులోని స్వభావాన్ని బట్టి, తీవ్రతను బట్టి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రాథమిక విచారణ జరుపడానికి అనుమతిని ఇస్తారు. ఈ విచారణ దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేసు నమోదు కావడానికే బాధితులు తీవ్రమైన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. 7 ఏళ్ల లోపు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాలు 98 వరకు ఉన్నాయి.
వాటిలో చాలా నేరాలు తీవ్రమైన నేరాలే. ప్రాథమిక విచారణ పేరుతో నెలల తరబడి విచారణ జరిపితే సాక్ష్యాలు మాయమయ్యే పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రథమ సమాచార నివేదిక ఉద్దేశ్యం కూడా దెబ్బ తినే అవకాశం మరింత ఉంది. బాధితులకు లాభం చేద్దామనే ఉద్దేశ్యంతో ఈ నిబంధన ఏర్పాటు చేశారని ప్రభుత్వం చెప్పినప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. ఈ నిబంధన దుర్వినియోగం కానుందని స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ విమర్శను గమనించి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని బీపీఆర్డీఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఈ ప్రాథమిక విచారణ గురించి విడుదల చేసింది. దాని ప్రకారం ప్రాథమిక విచారణ కోసం ఆఫీసర్ ఇన్‌ఛార్జి ఆఫ్ పోలీస్ స్టేషన్ అనుమతి కోరిన 24 గంటలలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇవ్వాలని చెప్పారు. ఒకవేళ 24 గంటల్లో అనుమతి ఇవ్వకపోయినా, అనుమతిని తిరస్కరించినా, ఏ విషయాన్ని తెలియచేయకపోయినా... ఆ పోలీసు అధికారి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టవచ్చు.
ఈ ప్రా«థమిక విచారణ సమయం లో పోలీసు అధికారి సాక్ష్యాలు నమోదు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు చేసిన తర్వాత కూడా సాక్షులను విచారిస్తారు. వీటి వల్ల సాక్ష్యాలలో వైరుద్ధ్యాలు పెరిగి కేసు బలహీనపడే అవకాశం ఉంది. దానివల్ల బాధితులకి న్యాయం జరుగదు. మరి ఎవరి కోసం ఈ మార్పులు? ఈ కొత్త చట్టాలు? దీనికి సమాధానం కాలమే చెప్తుంది.
డా‘‘ మంగారి రాజేందర్
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ ‘ 9440483001
Comments
Please login to add a commentAdd a comment