Supreme Court Suo Moto Investigation On Manipur Incident, Suspense Over Centre Affidavit Reaction - Sakshi
Sakshi News home page

Manipur Incident: మణిపూర్‌ వీడియోపై నేడు సుప్రీం సుమోటో విచారణ.. ‘కేంద్రం అఫిడవిట్‌’ రియాక్షన్‌పై ఉత్కంఠ

Published Fri, Jul 28 2023 7:32 AM | Last Updated on Fri, Jul 28 2023 9:32 AM

Manipur Video Case: Supreme Court suo moto Hearings Update  - Sakshi

మణిపూర్‌ అల్లర్ల విషయంలో కేంద్రం సీరియస్‌గానే ఉంది. మరీ ముఖ్యంగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను మరింత తీవ్రంగా పరిగణిస్తోంది.  ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించబోం. కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఇక విచారణనే మణిపూర్‌ వెలుపలా.. అదీ కాలపరిమితిలో పూర్తయ్యేలా ఆదేశించండి: కేంద్రం హోం శాఖ

ఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుమోటోsuo motoగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. నిన్న గురువారం మణిపూర్‌ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. 

కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించిన కేంద్రం హోం శాఖ..  మరోవైపు ఈ కేసు ట్రయల్‌ కాలపరిమితితో(ఆరు నెలల గడువు) జరగాలని.. అదీ మణిపూర్ వెలుపలే జరగాలని అఫిడవిట్‌లో సుప్రీంను కోరింది.

సీబీఐకి దర్యాప్తు బదిలీ అయ్యింది. కేంద్రం మాత్రం దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తవుతుందని నమ్ముతోంది. అయితే విచారణ మాత్రం కాలపరిమితితో పూర్తి కావాలని, ఆ విచారణ మణిపూర్‌ వెలుపలే జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును కేంద్ర హోం శాఖ కోరింది.

శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అయినా.. కేంద్రం తమ వంతుగా న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సదరు అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. లైంగిక దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చాక.. కేంద్రం ఎప్పటికప్పుడు కేసు పురోగతిని పర్యవేక్షిస్తోందని తెలియజేసింది. దీంతో నేటి విచారణలో కేంద్రం అఫిడవిట్‌పై సుప్రీం ధర్మాసనం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది.


ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో.. మీడియా ద్వారా మణిపూర్‌ వైరల్‌ వీడియోను సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు.  జులై 20వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం తీవ్ర స్థాయిలో కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాలను ఉద్దేశిస్తూ..  ‘‘యావత్‌ దేశమే కాదు.. ఈ న్యాయస్థానాన్ని ఆ వీడియో బాధించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయయారు.  ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి. ప్రభుత్వాలు గనుక చర్యలు చేపట్టకపోతే మేమే రంగంలోకి దిగుతామ’’ని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ..  జులై 28(నేటికి) విచారణ వాయిదా వేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement