న్యూఢిల్లీ: 2022లో గుజరాత్‌లోని ఖేడాలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన అయిదుగురిని బహిరంగంగా కొట్టిన ఘటనపై సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్తంభానికి కట్టేసి కొట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీసింది. నిర్బంధం, అనుమానితుల విచారణలకు సంబంధించి సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన మార్గదర్శకాలను పట్టించుకోనందుకు కోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ గుజరాత్ హైకోర్టు నలుగురు పోలీసులకు 14 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.
ఇన్‌స్పెక్టర్ ఏవీ పర్మార్, సబ్ ఇన్‌స్పెక్టర్ డీబీ కుమావత్, హెడ్ కానిస్టేబుల్ కేఎల్ దభి, కానిస్టేబుల్ ఆర్‌ఆర్ దభీలు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఈ అఘాయిత్యాలను ఏమనాలి? అందరూ చూస్తుండగానే ప్రజలను స్తంభానికి కట్టేసి కొడతారా.
అలా చేసే అధికారం మీకుందా? కోర్టు జోక్యం చేసుకోవాలంటూ మళ్లీ మీరే వస్తారు. అయితే, వెళ్లండి, కస్టడీని అనుభవించండి. మీరు పనిచేసే చోట మీరే అతిథులుగా ఉండండి. అక్కడ మీకు ప్రత్యేక ఆతిథ్యం కూడా దొరుకుతుంది’అని ధర్మాసనం తీవ్రస్వరంతో పేర్కొంది. పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే పదేపదే కోరడంతో 14 రోజుల జైలు శిక్షపై ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: తగ్గేదేలే.. రాహుల్ గాంధీపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment