రాజ్‌కోట్: గుజరాత్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఖైదీతో స్నేహం చేశారు. ఒక కేసులో విచారణకు ఆ ఖైదీని కోర్టుకు తీసుకెళ్లిన సదరు కానిస్టేబుళ్లు.. విచారణ అనంతరం అతనిని తిరిగి జైలుకు తరలించకుండా ఇంటి దగ్గర దిగబెట్టారు. అయితే విచిత్ర పరిస్థితుల్లో వారి నిర్వాకం బయటపడింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం గుజరాత్‌లో పేరు మోసిన మద్యం స్మగ్లర్ ధీరజ్ కరియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. విచారణలో భాగంగా కరియాను అమ్రేలీ జిల్లాలోని గాంధీనగర్ కోర్టుకు తీసుకెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లు, విచారణ ముగిశాక అతనిని తిరిగి జైలుకు తీసుకెళ్లకుండా, జునాగఢ్‌లోని అతని ఇంటి వద్ద దింపారు. ఈ వ్యవహారం ఎలా బయటపడిందనే వివరాల్లోకి వెళితే..
జునాగఢ్‌కు చెందిన ఒక రెస్టారెంట్ యజమాని తన హోటల్‌లో గొడవ పడిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్‌కు వచ్చిన ఆ ఇద్దరూ ముందుగా ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ తరువాత అక్కడే మద్యం తాగారు. వీరిని గమనించిన వెయిటర్ వారితో అక్కడ మద్యం తాగవద్దని కోరాడు. ఈ మాట విన్నవెంటనే ఆ ఇద్దరు వ్యక్తులూ వెయిటర్‌తో గొడవపడ్డారు. చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం రెస్టారెంట్ యజమాని ఆ వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఆ ఇద్దరూ కానిస్టేబుళ్లు రంజిత్ వాఘేలా, నితిన్ బంభానియాగా తేలింది.
ఈ ఉదంతంపై జునాగఢ్‌కు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం స్మగ్లర్ కరియాను కోర్టు విచారణ కోసం గాంధీనగర్‌కు తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు వారు ఆ ఖైదీని జైలుకు తీసుకెళ్లేందుకు బదులు అతను ఉంటున్న జునాగఢ్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారు అక్కడున్న ఒక రెస్టారెంట్‌లో మద్యం సేవించారన్నారు. విషయం బయటపడటంతో జునాగఢ్ పోలీసులు.. కానిస్టేబుళ్లు రంజిత్ వాఘేలాను, నితిన్ బంభానియాను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఖైదీ ధీరజ్ కరియాను తిరిగి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment