
(ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చెపట్టింది. విచారణలో భాగంగా.. ప్రభత్వుం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలను వినిపించారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో విద్యాహక్కు చట్టంలోని 29వ నిబంధనను ఉల్లంఘించలేదని తెలిపారు. భాషాపరంగా అల్ప సంఖ్యాకుల కోసం కొన్ని చర్యలను, వారి మాతృభాషా పరిరక్షణకోసం భద్రతా చర్యలను మాత్రమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ఇలాంటి అంశాల్లో ఆచరించదగ్గ మూడు తీర్పులను కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ముసాదా విధానాన్ని పరిశీలించాల్సిందిగా ఏజీ శ్రీరామ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
సాధ్యాసాధ్యాలను మాత్రమే ఈ ముసాదా విధానం చర్చించిందని ఏజీ శ్రీరామ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30లో పేర్కొన్న సంస్థలు (మైనార్టీ విద్యాసంస్థలు), ప్రైవేటు సంస్థలు ఎక్కడా ప్రభావితం కాలేదని శ్రీరామ్ కోర్టుకు చెప్పారు. తమకు ఇంగ్లిషు మీడియమే కావాలంటూ.. విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల్లో 97శాతం కోరుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచుతున్నామని ఆయన చెప్పారు. తమ పిల్లలు తెలుగు మీడియంలోనే చదువుతున్నారంటూ పిటిషనర్లు కోర్టు ముందు చెప్పడం లేదు.. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు.
పాఠ్య ప్రణాళకలో తెలుగును తప్పనిసరి చేస్తూ, మాతృభాషను అభివృద్ధి చేసే చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం తాజా జీవో జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారిచేత ఎన్నికైన ప్రభుత్వం తగిన రీతిలో విధానాలను రూపొందిస్తుందన్నారు. విధానాలను నిలువరించే అప్పిలేట్ అథారిటీ లా కోర్టులు వ్యవహరించజాలవని ఆయన అన్నారు. ఈ విధానం సరైందని.. మరొక విధానం కాదని కోర్టులు నిర్దేశించలేవని ఆయన తెలిపారు. విధానాల విషయంలో కోర్టులకు పరిమితమైన పాత్ర ఉంటుందని ఏజీ శ్రీరామ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment