బురదజల్లడానికే నిమ్మగడ్డ పిటిషన్‌  | AG Sriram Give Report To High Court Over Nimmagadda Ramesh Kumar | Sakshi
Sakshi News home page

బురదజల్లడానికే నిమ్మగడ్డ పిటిషన్‌ 

Published Fri, Apr 2 2021 4:20 AM | Last Updated on Fri, Apr 2 2021 5:07 AM

AG Sriram Give Report To High Court Over Nimmagadda Ramesh Kumar - Sakshi

సాక్షి, అమరావతి: గవర్నర్‌కు తాను రాసిన లేఖలు లీక్‌ అయ్యాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగంపై బురదజల్లడమేనని రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. ప్రతి ప్రభుత్వ యంత్రాంగం ప్రతిష్టను అపఖ్యాతి పాల్జేసేందుకే ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. ఈ పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారించారు. ఈ సందర్భంగా ఏజీ తన వాదనలు వినిపిస్తూ.. లేఖల లీక్‌ జరిగిందంటున్న నిమ్మగడ్డ, అలా లీక్‌ కావడం ఏ చట్ట ప్రకారం నేరమో చెప్పడం లేదన్నారు. ఏ కేసులో పడితే ఆ కేసులో, ఎలా పడితే అలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి వీల్లేదని, న్యాయస్థానాలు అధికరణ 226 కింద తమ విచక్షణాధికారాలను చాలా జాగ్రత్తగా, అరుదుగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు.

తాను హైకోర్టు జడ్జితో సమానమంటూ చెప్పుకొన్న నిమ్మగడ్డ.. అదే రీతి హుందాతనాన్ని ప్రదర్శించలేకపోయారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారని, ఇప్పుడు గౌరవ ప్రదమైన గవర్నర్‌ కార్యాలయంపై కూడా ఆరోపణలు చేస్తూ వివాదంలోకి లాగారని తెలిపారు. నిమ్మగడ్డ గతంలో కేంద్రానికి రాసిన లేఖ వాస్తవానికి ఓ రాజకీయ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిందని, దీనిపై ఓ ఎంపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేశారని చెప్పారు. దీనిపై నిమ్మగడ్డ, ఎన్నికల కమిషన్‌ కార్యాలయ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫు న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్‌కు రాసిన లేఖలు బయటకు రావడాన్ని ఏ చట్టం అడ్డుకుంటుందో నిమ్మగడ్డ ఎక్కడా చెప్పడం లేదన్నారు.

గతంలో న్యాయశాఖ మంత్రి, ఢిల్లీ హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు సీజేకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు బహిర్గతం అయ్యాయని, అప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి వాటికి ఎలాంటి రక్షణ ఉండదంటూ తీర్పునిచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. లేఖల లీక్‌ వల్లే హక్కుల ఉల్లంఘన నోటీసులు వచ్చాయని నిమ్మగడ్డ చెబుతున్నారుగా? దీనిపై ఏమంటారని ప్రశ్నించారు. ప్రస్తుత కేసుకూ దానికి ఏ మాత్రం సంబంధం లేదని ప్రశాంత్‌ తెలిపారు. గవర్నర్‌కు రాసిన లేఖలే హక్కుల ఉల్లంఘన నోటీసులకు దారి తీశాయా? అన్న అంశంపై తాను తన కౌంటర్‌లో స్పష్టతనిస్తానని చెప్పారు. ప్రతివాదులైన మంత్రి బొత్స సత్యనారాయణ, మెట్టు రామిరెడ్డి తరఫు న్యాయవాదుల వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 6కి వాయిదా వేస్తూ జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీచేశారు. అదేరోజున నిమ్మగడ్డ తరఫు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు తిరుగు సమాధానం ఇచ్చేందుకు సైతం అనుమతి ఇచ్చారు.

చదవండి: చంద్రబాబు సర్కారులో వైద్య పరికరాల స్కామ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement