
సాక్షి, అమరావతి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ హైకోర్టు ముందు రివ్యూ పిటిషన్ లేదా సుప్రీంకోర్టు ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలుచేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు కొందరు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ పెండింగ్‌లో ఉండగా రాజధాని వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాల్లో తాము విచారణ జరపడం సమంజసం కాదని స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పులపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు కోర్టు ధిక్కారమన్న ప్రశ్న తలెత్తదని చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. ఈలోపు పిటిషనర్లు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును సీఎం, మంత్రులు, అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వారిచర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు దాఖలు చేసిన కోర్టుధిక్కార పిటిషన్లు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. వీటితోపాటు రాజధాని అంశంపై వ్యాజ్యాలు కూడా విచారణకు వచ్చాయి. వీటన్నింటిని సీజే ధర్మాసనం విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment