
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల నిర్వహణ విషయంలో తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయ మూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కారణం గా గత ఏడాది పురపాలక ఎన్నికలు ఏ దశలో వాయిదా పడ్డాయో, తిరిగి ఆ దశ నుంచే మొదలవుతాయంటూ ఈ నెల 15న ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నక్కా యశోద, కంచు మధుసూధన్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన చిప్పిడి విష్ణువర్ధన్‌రెడ్డి, మరో ఆరుగురితో పాటు మరి కొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై మంగళవారం జస్టిస్ సోమయాజులు మరోసారి విచారణ జరిపారు.
ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు..
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫు న్యాయ వాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో, అక్కడి నుంచి ఎన్నికలను పెట్టాలన్న నిర్ణయంపై దాఖలైన వ్యాజ్యాలకు అసలు విచారణార్హతే లేదన్నారు. కరోనా కారణంగానే గత మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేశామని, దీన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగింపులో భాగంగానే అప్పుడు నిలిచిపోయిన ఎన్నికలను ఇప్పుడు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు.
ఎన్నికల కమిషన్‌ది ఏకపక్ష నిర్ణయం కాదు..
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతే పురపాలక ఎన్నికల ప్రక్రి యను పునరుద్ధరిస్తూ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియను కొనసాగనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది ఎన్నికలను వాయిదా వేసేటప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పుడు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పిం దని గుర్తుచేశారు. ఈ ఉత్తర్వులను పిటిషనర్లు సవాలు చేయలేదన్నారు. ఎన్నికల్లో పోటీచేయడం, పాల్గొనడం చట్టబద్ధ హక్కు మాత్రమేనని తెలిపారు. గతంలో ఆపిన చోటునుంచే ఎన్నికలను కొనసాగించాలన్న కమిషన్ నిర్ణయం ఏకపక్షం ఎంతమాత్రం కాదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment