సాక్షి, అమరావతి: కొత్త వేతన సవరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏ రూపంలో ఉన్నా, వాటిని ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. పరిస్థితికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం రాజ్యాంగ వ్యతిరేకమే కాక, సర్వీసు నిబంధనలకు కూడా విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసును రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ విశాఖపట్నంకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
శుక్రవారం కోర్టు విచారణ మొదలు కాగానే సాంబశివరావు తరఫు న్యాయవాది ఎస్.శరత్ కుమార్ తమ పిల్ గురించి న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కుంభజడల మన్మధరావుల ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళుతున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో విచారణ జరపాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది.
ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారు..
ఈ సందర్భంగా శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పీఆర్‌సీ సాధన సమితి పేరుతో ఉద్యోగులు ఆందోళనలు చేస్తూ ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారాన్నే ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఘర్షణ ఉండకూడదన్నారు. చర్చలు, ఏకాభిప్రాయం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా, ఉద్యోగులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని వివరించారు. ఉద్యోగులు మూకుమ్మడిగా సమ్మెకు వెళితే పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయన్నారు.
‘ఛలో విజయవాడ’ పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగులందరూ ఓ చోట చేరారని, ప్రస్తుత కోవిడ్ థర్డ్‌వేవ్ పరిస్థితుల్లో ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు. ఓ రకంగా రాష్ట్రాన్ని కోవిడ్ ప్రమాదంలోకి నెట్టడమే అవుతుందని తెలిపారు. అందుకే సమ్మెను నిషేధించాలని కోరుతున్నామని తెలిపారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విన్నవించారు. రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యోగులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఉద్యోగులు ప్రస్తుతం సమ్మె చేయడం లేదు కదా? అని ప్రశ్నించింది. పెన్‌డౌన్ మొదలు పెట్టారని శరత్ చెప్పగా, పెన్‌డౌన్ సమ్మె కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కోవిడ్ ఉండగా ఎలా అనుమతి ఇచ్చారు?
ఈ వ్యవహారంలో మీ స్పందన ఏమిటని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌ను అడిగింది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదన్న వాదన సరికాదని శ్రీరామ్ చెప్పారు. మరి గురువారం ఏం జరిగింది? కోవిడ్ వ్యాప్తి ఉన్నా అనుమతులు ఎలా ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. గురువారం ఛలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని శ్రీరామ్ తెలిపారు. 5 వేల మంది రావాల్సిన చోట 35 వేల నుంచి 40 వేల మంది వరకు వచ్చారని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని శ్రీరామ్ చెప్పారు. సుప్రీంకోర్టు కూడా టీకే రంగరాజన్ కేసులో ఇదే చెప్పిందన్నారు. కాబట్టి సమ్మె చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు.
అలా అయితే ప్రభుత్వం కోవిడ్‌ను నియంత్రించేందుకు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా మహమ్మారి ఇతరులపై కూడా ప్రభావం చూపుతుందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలంది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తాము ఆ అంశం జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో శరత్ స్పందిస్తూ, సమ్మెకు వెళ్లకుండా ఉద్యోగులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రానున్న రోజుల్లో పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో తెలియదని చెప్పింది. ఉద్యోగుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఈ నెల 10న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment