సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారుల నియామకంలో ఎలాంటి నిబంధనలు లేవని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, పరిపాలన వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న వారిని సలహాదారులుగా నియమించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సలహాదారులు నిర్వర్తించాల్సిన విధులను వారి నియామక జీవోల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు వివరించారు. వారి నియామకం తాత్కాలికమైనదని తెలిపారు. ఆ నియామకాలపై ఏ చట్టంలోనూ నిషేధం లేదని, ప్రభుత్వ అవసరాలను బట్టి వారి నియామకం ఉంటుందన్నారు. వీరి నియామకాన్ని ప్రజాధనం వృథా అనే కోణంలో చూడటానికి వీల్లేదని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ స్పందిస్తూ.. సలహాదారులను నియమించే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారా? వారు మీడియాతో మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. గతంలో ఎవరూ మీడియాతో మాట్లాడలేదన్నారు. ఏజీ వాదనలు వినిపిస్తూ.. గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడారని తెలిపారు.
సాహ్ని నియామకం సరైనదే..
పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉండటం వల్ల ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నియమించడం సంప్రదాయంగా వస్తోందని శ్రీరామ్ కోర్టుకు వివరించారు. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకం విషయంలో గవర్నర్‌కు ముఖ్యమంత్రి ఏ రకమైన సలహాలు ఇవ్వలేదని, సిఫారసు చేయలేదని తెలిపారు. ఒకవేళ సలహా ఇచ్చినా, సిఫారసు చేసినా దానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. పరిపాలనలో సమర్థత కలిగిన వారి పేర్లను ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని, అంతిమంగా గవర్నర్ తన విచక్షణాధికారం మేరకే నీలం సాహ్నిని నియమించారని వివరించారు. ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఆమె ఎస్‌ఈసీగా నియమితులయ్యారని చెప్పారు. ఆమె నియామకం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు.
ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకం రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు శుక్రవారం వాదనలు వినిపిస్తూ.. నీలం సాహ్ని ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించారని, ఆమె పేరును గవర్నర్‌కు సీఎం సిఫారసు చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ఎస్‌ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులే నియమితులు కావాలని నిబంధనలు చెబుతున్నప్పుడు, వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎస్‌ఈసీ నియామకం, పిటిషనర్ విచారణార్హత తదితరాలపై గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment