
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని నియామకం సరైనదేనని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రాజ్యాంగంలోని అధికరణ 243కే కింద తనకున్న విచక్షణాధికారాల మేరకు గవర్నర్ ఆమెను నియమించారని తెలిపారు. ఎస్‌ఈసీ నియామకానికి గవర్నర్ పెద్ద ఎత్తున కసరత్తు చేశారని వివరించారు. 25 ఏళ్ల అనుభవం ఉండి, గత మూడేళ్ల కాలంలో పదవీ విరమణ చేసిన 11 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను, వారి వార్షిక పనితీరు మదింపు నివేదికలను (ఏపీఏఆర్) తెప్పించుకుని పరిశీలించారని చెప్పారు. ఇందులో నీలం సాహ్నికి గత ఐదేళ్లుగా 10 గ్రేడింగ్ ఉందని, మిగిలిన ఏ అధికారికీ ఇంత గ్రేడింగ్ లేదన్నారు. అలాగే ఆమెపై ఎలాంటి కేసులు, ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో లేవని తెలిపారు.
పిటిషనర్ వాదనల్లో అర్థం లేదు..
నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించే ముందు సుప్రీంకోర్టు తీర్పును సైతం గవర్నర్ పరిగణనలోకి తీసుకున్నారని మీనా కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తేనే ఆమెను ఎస్‌ఈసీగా నియమించాలని గవర్నర్ షరతు విధించారని, దీంతో ఆమె ఆ పదవికి రాజీనామా చేశారన్నారు. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాకే ఆమెను ఎస్‌ఈసీగా నియమించారని వివరించారు. అందువల్ల ప్రభుత్వ సలహాదారును ఎస్‌ఈసీగా నియమించారంటూ పిటిషనర్ చేస్తున్న వాదనలో అర్థం లేదన్నారు. అధికరణ 243కే కింద గవర్నర్ కార్యనిర్వాహక నిర్ణయాధికారాన్ని ఉపయోగించి తీసుకునే నిర్ణయాలపై న్యాయ సమీక్షకున్న అవకాశం చాలా స్వల్పమని గుర్తు చేశారు. నిరాధార ఆరోపణలు, స్వీయ ప్రకటనల ఆధారంగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా పిటిషనర్ న్యాయప్రక్రియను దుర్వినియోగం చేశారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు.
సుప్రీంకోర్టు తీర్పు మేరకే..
ఎన్నికల కమిషనర్‌గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలం సాహ్నిని వివరణ కోరడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు మీనా కౌంటర్ దాఖలు చేశారు. కోవారెంటో పిటిషన్ మంగళవారం విచారణకు రాగా ప్రభుత్వంతోపాటు ఇతరులు దాఖలు చేసిన కౌంటర్లకు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది బి.శశిభూషణ్‌రావు గడువు కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ విచారణను జూలై 8కి వాయిదా వేశారు. గవర్నర్ పరిగణనలోకి తీసుకున్న 11 మంది అధికారులతో పాటు సీఎంవో విశ్రాంత ఐఏఎస్‌లు శామ్యూల్, ఎల్.ప్రేమచంద్రారెడ్డి పేర్లను సూచించిందని మీనా పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని నీలం సాహ్ని వైపు గవర్నర్ మొగ్గు చూపారన్నారు. ఆమె సీఎస్‌గా పనిచేశారని, ఆ పోస్టు ప్రభుత్వాలతో సంబంధం లేని తటస్థ పోస్టు అని తెలిపారు.