ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా వ్యవహరిస్తున్న ఎ.సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీలుగా ఉన్న కె.జి.కృష్ణమూర్తి, బి.భాస్కరరావు తెలంగాణ రాష్ట్ర ఏజీ, అదనపు ఏజీల పదవులకు రాజీనామా చేశారు.
కొత్త వారొచ్చేవరకూ కొనసాగండి: సీఎం
కొత్త ఏజీగా రామకృష్ణారెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు!
అదనపు ఏజీగా రామచంద్రరావు పేరు ఖరారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా వ్యవహరిస్తున్న ఎ.సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీలుగా ఉన్న కె.జి.కృష్ణమూర్తి, బి.భాస్కరరావు తెలంగాణ రాష్ట్ర ఏజీ, అదనపు ఏజీల పదవులకు రాజీనామా చేశారు. వీరు మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి తమ రాజీనామాలను సమర్పించారు. ఆ రాజీనామాలను కేసీఆర్ వెంటనే ఆమోదించారు. అయితే కొత్త ఏజీ, అదనపు ఏజీల నియామకం జరిగేంతవరకు ఆ పోస్టుల్లో కొనసాగాలని కోరినట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో కొత్త ఏజీ నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు, అప్పటివరకు ఏజీ, అదనపు ఏజీలుగా ఉన్న వారు తమ పదవులకు రాజీమానా చేయడం సంప్రదాయం. తద్వారా కొత్త ప్రభుత్వం తమకు నచ్చిన వ్యక్తిని ఏజీగా నియమించుకునే వీలు కలుగుతుంది.
ఇదిలా ఉంటే, ఏజీ నియామకం విషయంలో కేసీఆర్ తన కసరత్తును పూర్తి చేసినట్లు తెలిసింది. ఏజీగా కె.రామకృష్ణారెడ్డిని నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అలాగే అదనపు ఏజీగా జె.రామచంద్రరావు పేరును కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏజీ, అదనపు ఏజీలుగా సుదర్శన్‌రెడ్డి, కృష్ణమూర్తి, భాస్కరరావు యథాతథంగా కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణం చేసిన తరువాత, ఆరాష్ట్ర ఏజీ, అదనపు ఏజీ పదవులకు సైతం వారు రాజీనామా చేసే అవకాశం ఉంది.