Sudarsana Reddy
-
ఏజీ, అదనపు ఏజీల రాజీనామా
కొత్త వారొచ్చేవరకూ కొనసాగండి: సీఎం కొత్త ఏజీగా రామకృష్ణారెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు! అదనపు ఏజీగా రామచంద్రరావు పేరు ఖరారు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా వ్యవహరిస్తున్న ఎ.సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీలుగా ఉన్న కె.జి.కృష్ణమూర్తి, బి.భాస్కరరావు తెలంగాణ రాష్ట్ర ఏజీ, అదనపు ఏజీల పదవులకు రాజీనామా చేశారు. వీరు మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి తమ రాజీనామాలను సమర్పించారు. ఆ రాజీనామాలను కేసీఆర్ వెంటనే ఆమోదించారు. అయితే కొత్త ఏజీ, అదనపు ఏజీల నియామకం జరిగేంతవరకు ఆ పోస్టుల్లో కొనసాగాలని కోరినట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో కొత్త ఏజీ నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు, అప్పటివరకు ఏజీ, అదనపు ఏజీలుగా ఉన్న వారు తమ పదవులకు రాజీమానా చేయడం సంప్రదాయం. తద్వారా కొత్త ప్రభుత్వం తమకు నచ్చిన వ్యక్తిని ఏజీగా నియమించుకునే వీలు కలుగుతుంది. ఇదిలా ఉంటే, ఏజీ నియామకం విషయంలో కేసీఆర్ తన కసరత్తును పూర్తి చేసినట్లు తెలిసింది. ఏజీగా కె.రామకృష్ణారెడ్డిని నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అలాగే అదనపు ఏజీగా జె.రామచంద్రరావు పేరును కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏజీ, అదనపు ఏజీలుగా సుదర్శన్‌రెడ్డి, కృష్ణమూర్తి, భాస్కరరావు యథాతథంగా కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణం చేసిన తరువాత, ఆరాష్ట్ర ఏజీ, అదనపు ఏజీ పదవులకు సైతం వారు రాజీనామా చేసే అవకాశం ఉంది. -
తెలంగాణ బిల్లు-న్యాయపరమైన అంశాలపై చర్చ
హైదరాబాద్: టిఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేంద్ర, ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఈరోజు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు) రాష్ట్రపతికి తిప్పి పంపాలని మంత్రి శైలజానాధ్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు నోటీసు ఇప్పించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన బిల్లు అంతా తప్పులు తడకగా ఉందని సీఎం పేర్కొన్నారు. శాసనమండలిలో కూడా మంత్రి రామచంద్రయ్య ఇదే నోటీస్ ఇచ్చారు. టిడిపి కూడా ఇదే తరహా నోటీస్ ఇచ్చింది. ఈ నేపధ్యంలో బిల్లు తిప్పి పంపాలని ఉభయ సభలలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందువల్ల ఈ తీర్మానం విషయంతోపాటు న్యాయపరమైన అంశాలపై కూడా వారు సుదర్శన రెడ్డితో చర్చిస్తారు. -
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై రైతుల ఆందోళన
హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాల నేతలు ఈరోజు భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రైతు నేతలు కోరారు. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం పరిశీలించాలని కోరారు. కృష్ణా ఆయకట్టులో నిర్మించిన ప్రాజెక్టులకు నష్టం జరగకుండా చేయాలని రైతు సంఘం నేత రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల పంపిణీపై వెలువడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పుఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రిబ్యునల్ తుంగభద్ర జలాల్లో 4 టీఎంసీల అదనపు జలాలను మాత్రమే కేటాయించింది. అన్ని అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. మిగులు జలాలపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రాజెక్టులకు ఇది శరాఘాతంగా మారనుంది. హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు 190 టీఎంసీల నీరు అవసరం. ఈ ప్రాజెక్టులను 14వేల కోట్లు రూపాయల ఖర్చు పెట్టి పూర్తి చేశారు. ప్రస్తుతం వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. నికరజలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కే అతితక్కువ కేటాయింపు జరిగింది. కర్ణాటకకు 43 టీఎంసీలు, మహారాష్ట్రకు 65 టీఎంసీలు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు 39 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. మిగులు జలాల విషయంలో మహారాష్ట్రకు 35 టీఎంసీలు, కర్ణాటకకు 105 టీఎంసీలు, ఆంధప్రదేశ్‌కు 145 టీఎంసీలు ఇచ్చారు. అన్ని కలిపితే ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించారు. ప్రస్తుత తీర్పుతో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు 519 .5 నుంచి 524.25 మీటర్లకు పెరుగుతుంది. దీనివల్ల దాదాపు 100 టీఎంసీల నీటిని ఎక్కువుగా వాడుకోనున్నారు. మొత్తంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర రైతులకు శరాఘాతమేనని భావిస్తున్నారు.