శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న నూతన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. చిత్రంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్
సాక్షి, హైదరాబాద్: నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న ఏజీ పదవిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు భర్తీ చేసింది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్‌ను నియమించింది. బీసీ (పద్మశాలి) వర్గానికి చెందిన బండా శివానంద ప్రసాద్ (బీఎస్ ప్రసాద్)ను ఏజీగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో అడ్వొకేట్ జనరల్‌గా నియమితులైన తొలి బీసీ న్యాయవాదిగా బీఎస్ ప్రసాద్ చరిత్ర సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1956 నుంచి 2014 వరకు 17 మంది అడ్వొకేట్ జనరల్స్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో అత్యధికం శాతం రెడ్డి, బ్రాహ్మణ వర్గాలకు చెందిన న్యాయవాదులే ఉన్నారు. ఒక్క బీసీ న్యాయవాది కూడా ఏజీగా నియమితులు కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఇద్దరు అడ్వొకేట్ జనరల్స్ పనిచేశారు. ఈ ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే.
30 ఏళ్లు న్యాయవాదిగా..
వరంగల్ జిల్లా జనగామకు చెందిన బీఎస్ ప్రసాద్ గత 30 ఏళ్లుగా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పలు ఆర్థిక సంస్థలకు, జాతీయ బ్యాంకులకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. తొలుత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ)గా కొన్నేళ్లు సేవలు అందించిన బీఎస్ ప్రసాద్, తర్వాత కొన్ని సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించాల్సి వచ్చింది.
8 నెలలకే తప్పుకున్న ప్రకాశ్‌రెడ్డి
ఏపీ విభజన తర్వాత కొలువు దీరిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డిని నియమించింది. ఆయన 3 ఏళ్లపాటు ఏజీగా బాధ్యతలు నిర్వర్తించి 2017 జూలై 12న రాజీనామా చేశారు. ఆ తర్వాత మరో సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి జూలై 17న ఏజీగా నియమితులయ్యారు. ఎనిమిది నెలల తర్వాత ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది మార్చి 26న ఏజీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణకు దారి తీసిన అసెంబ్లీ ఘటనల తాలూకు రికార్డులను కోర్టు ముందుంచుతానని హైకోర్టుకు ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది. హామీపై ప్రభుత్వ పెద్దలు వివరణ కోరడంతో నొచ్చుకున్న ప్రకాశ్‌రెడ్డి ఏజీ పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఏజీ పోస్టు భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదుల పేర్లను పరిశీలించింది. అయితే వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఆ పేర్లను పక్కన పెట్టేశారు. ఇదే సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావును ఏజీ పోస్టులో కూర్చోబెట్టేందుకు కొందరు పెద్దలు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే అందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపలేదు.
అప్పటి రాజీనామాకు ఇప్పుడు ఆమోదం
మార్చి నుంచి రాష్ట్రానికి ఏజీ లేరు. ఏజీని నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది సతీశ్ కుమార్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. శశిధర్‌రెడ్డి వ్యాజ్యంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఏజీ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏజీ నియామకంపై కసరత్తు చేసిన కేసీఆర్.. ఈసారి బీసీకి ఆ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందిస్తున్న బీఎస్ ప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఆ మేరకు ఆయనను ఏజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ప్రకాశ్‌రెడ్డి సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆమోదం మార్చి 26 నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment