సీఎం చంద్రబాబు నిర్ణయం
గవర్నర్ ఆమోదమే తరువాయి
అదనపు ఏజీ పోస్టు ఉంటుందా? లేదా?
ఉంటే ఒక పోస్టా? రెండా?
ఒక పోస్టే అయితే జనసేనకూ అవకాశం
పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం ఆలస్యం
శ్రీరామ్, పొన్నవోలు, నాగిరెడ్డి రాజీనామాలు ఆమోదం
సాక్షి, అమరావతి: అందరూ ఊహించిన విధంగానే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఏజీగా దమ్మాలపాటిని నియమించాలన్నది చంద్రబాబు అభిలాష అని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కోరారు. దీంతో సీఎస్ ఏజీ నియామక ఫైల్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే, దమ్మాలపాటి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయి.
రెండోసారి ఏజీగా దమ్మాలపాటి
ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కావడం ఇది రెండోసారి. 2016లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయన ఏజీగా సేవలందించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన∙వెంటనే సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ అడ్వొకేట్ జనరల్ అయ్యారు. , దమ్మాలపాటి అదనపు ఏజీగా నియమితులయ్యారు. 2016లో వేణుగోపాల్ ఏజీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 2016 మే 28న దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయేంత వరకు ఏజీగా కొనసాగారు.
దమ్మాలపాటికే పూర్తి స్వేచ్ఛ
ఏజీ నియామకం కొలిక్కి రావడంతో అదనపు ఏజీ (ఏఏజీ), ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు (ఎస్జీపీ), ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదుల (ఏజీపీ) పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. అదనపు ఏజీ పోస్టు భర్తీ చేస్తారా లేక గతంలోలా ఆ పోస్టును భర్తీ చేయకుండా వదిలేస్తారా అన్న దానిపై న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకవేళ ఏఏజీ పోస్టును భర్తీ చేస్తే జనసేన లేదా బీజేపీల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. అదనపు ఏజీ పోస్టు ఒకటా లేక రెండు ఉంటాయా అన్నది కూడా తేలాల్సి ఉంది.
ఒక అదనపు ఏజీ పోస్టు మాత్రమే భర్తీ చేస్తే జనసేనకే అవకాశం ఉంది. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) నియామకం కొంత సుదీర్ఘ ప్రక్రియ. హైకోర్టును సంప్రదించిన తరువాతే పీపీని నియమించాలి. అందువల్ల పీపీ నియామకం అలస్యమవుతుంది. టీడీపీ నుంచి ఎవరిని జీపీలు, ఏజీపీలు చేయాలన్న విషయంపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. జీపీలు, ఏజీపీలతో పాటు స్టాండింగ్ కౌన్సిల్స్ నియామకాల్లో గతంలోలానే దమ్మాలపాటి శ్రీనివాస్‌కు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలిసింది.
శ్రీరామ్ తదితరుల రాజీనామాలకు ఆమోదం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులిచ్చి0ది.
దమ్మాలపాటి వైపే చంద్రబాబు మొగ్గు
తాజాగా ఏజీ పోస్టుకి పలువురి పేర్లు వినిపించాయి. సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు సహా పలువురి పేర్లు చర్చకు వచ్చాయి. అయితే చంద్రబాబు చివరకు దమ్మాలపాటి వైపే మొగ్గు చూపారు. గతంలో ఏజీగా పనిచేసి ఉండటం, పలు విపత్కర పరిస్థితుల నుంచి చంద్రబాబుతో సహా పార్టీ ఇతర నేతలను బయటపడేయడం, పార్టీలో అందరికీ అందుబాటులో ఉండటం వంటివి దమ్మలపాటికి కలసి వచ్చాయి. న్యాయవ్యవస్థలో దమ్మాలపాటికి మంచిపట్టు ఉండటం కూడా ఆయనకు సానుకూల అంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంతకాలం ఆయన ఏజీ పదవిలో కొనసాగుతారు.
Comments
Please login to add a commentAdd a comment