తప్పుకోమనడానికి కారణాలేంటి: హైకోర్టు ధర్మాసనం | Telangana High Court Bench Slams AG Says This Is Like Forum Hunting | Sakshi
Sakshi News home page

ఫోరం హంటింగ్‌ చేస్తారా: తెలంగాణ హైకోర్టు

Published Tue, Jul 6 2021 8:49 AM | Last Updated on Tue, Jul 6 2021 1:46 PM

Telangana High Court Bench Slams AG Says This Is Like Forum Hunting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వినియోగం, విద్యుత్‌ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణ నుంచి తనను తప్పుకోవాలని తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ అభ్యర్థించడంపై జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరైన కారణాలు చెప్పకుండా విచారణ నుంచి తప్పుకోవాలనడం ఫోరం హంటింగ్‌ (అనుకూలమైన న్యాయమూర్తులు) చేయడమేనని మండిపడింది. ఇటువంటి పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను అక్కడికి పంపాలని ఏజీ కోరారు.

అయితే ఈ పిటిషన్‌ను తామే విచారించాలని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ ఇప్పుడే తమకు సమాచారం ఇచ్చారని జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు తెలిపారు. ఈ కేసును అత్యవసరంగా విచారణకు స్వీకరించిన తీరుపై తమకు అభ్యంతరం ఉందని, ఈ నేపథ్యంలో విచారణ నుంచి మీకు మీరుగా తప్పుకోవాలని ప్రసాద్‌ మళ్లీ కోరారు. ‘విచారణ నుంచి ఎందుకు తప్పుకోవాలి. ఏజీస్థాయి వ్యక్తి నుంచి ఇటువంటి అసమంజసమైన అభ్యర్థన రావడం సరికాదు. సహేతుకమైన కారణాలు లేకుండా ఇటువంటి అభ్యర్థన చేయడం ధర్మాసనంపై దాడిగా పరిగణించాల్సి ఉంటుంది. అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉదయం కోర్టు ప్రారంభ సమయంలో కోరారు.

కనీసం నేను కేసుకు సంబంధించిన పేపర్లను కూడా చూడలేదు, మా ముందు ఉంచనూ లేదు. భోజనం విరామం తర్వాత విచారణ చేస్తామని స్పష్టం చేశాం. తర్వాత ఈ కేసుకు సంబంధించిన పేపర్లను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు రిజిస్ట్రీ అధికారులు ఉంచారు. మా ధర్మాసనాన్ని విచారించాలని సీజే సూచించారు. తమకు అనుకూలమైన ధర్మాసనం కోసం తెలంగాణ ప్రభుత్వం (ఫోరం హంటింగ్‌) ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏజీ కార్యాలయం ఇటువంటి ట్యాక్టిక్స్‌ కోసం పాకులాడదని భావిస్తున్నాం. నన్ను తప్పుకోవాలనేందుకు సరైన కారణాలు చూపనందున ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం. పిటిషన్‌ను విచారిస్తాం’అని ధర్మాసనం స్పష్టం చేసింది.  

అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఏజీ 
ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ.. జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోర్టు ప్రారంభ సమయంలో అభ్యర్థించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మాత్రమే ఈ తరహా పిటిషన్లను విచారించాల్సి ఉందని, ఈ ధర్మాసనం విచారించడానికి లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచందర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలు ప్రతివాదులుగా ఉన్న పిటిషన్లను విచారించే పరిధి ఈ ధర్మాసనానికి మాత్రమే ఉందని వెంకటరమణ నివేదించారు. ఈ పిటిషన్‌ను భోజన విరామం తర్వాత విచారిస్తామని, అభ్యంతరాలుంటే అప్పుడు తెలియజేయాలని జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు స్పష్టం చేశారు.

దీంతో వెంటనే జె.రామచందర్‌రావు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ముందు హాజరై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసుల విచారణ రోస్టర్‌కు విరుద్ధంగా జస్టిస్‌ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం ఓ పిటిషన్‌ను భోజన విరామం తర్వాత విచారించేందుకు అనుమతి ఇచ్చిందని, ప్రస్తుత కేసుల విచారణ రోస్టర్‌ ప్రకారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మాత్రమే ఆ పిటిషన్‌ను విచారించాలని తెలిపారు. అయితే ఇదే విషయాన్ని జస్టిస్‌ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు చెప్పాలని సీజే స్పష్టం చేస్తూ ఏఏజీ అభ్యర్థనను తోసిపుచ్చారు. 

అంతర్రాష్ట్ర జల వివాదాల్లో ఈ పిటిషన్‌ ఎలా విచారణార్హం?
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్స్‌ ఉన్నప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులు జలవివాదాలపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి వీల్లేదని రాజోలిబండ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని.. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగం ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ ఎలా విచారణార్హమని హైకోర్టు ప్రశ్నించింది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో 100 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34ను సవాల్‌ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు శివరామకృష్ణ ప్రసాద్‌తోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం భోజన విరామం తర్వాత అత్యవసరంగా విచారించింది.

అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్‌ 11 కింద ఈ పిటిషన్‌ ఎలా విచారణార్హం అని ధర్మాసనం వెంకటరమణను ప్రశ్నించింది. ఇటువంటి వివాదాల్లో ట్రిబ్యునల్స్‌ మినహా హైకోర్టు, సుప్రీంకోర్టులు పిటిషన్లను విచారించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొంది. ఈ సమయంలో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రామచందర్‌రావు ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా.. ఈ కేసులో అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హాజరై వాదన లు వినిపిస్తున్నారని, ఆయనకు గౌరవం ఇవ్వాల ని ధర్మాసనం ఏఏజీకి సూచించింది. ‘రాజోలిబండ’కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి రావాలంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది, ఇరు రాష్ట్రాల ఏజీలకు సూచిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement