
తప్పించరూ..!
♦ అడ్వకేట్ జనరల్ రాజీనామా
♦ ప్రభుత్వానికి, గవర్నర్‌కు లేఖ
♦ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కొత్త చర్చ
సాక్షి, చెన్నై : ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ ముత్తుకుమార స్వామి హఠాత్తుగా పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలను వివరిస్తూ, తనను పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఆయన మంగళవారం లేఖ రాశారు. గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమయాజులు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ముత్తుకుమార స్వామిని దివంగత సీఎం జయలలిత నియమించారు. ప్రభుత్వం తరపున కోర్టుల్లో అన్ని రకాల వాదనలు ఉంచడమే కాదు, కీలక నిర్ణయాలను సైతం ఆయన అనేక సందర్భాల్లో తీసుకున్నారు.
ప్రభుత్వానికి అనేక న్యాయపర అంశాలతో కూడిన సిఫారసులు కూడా చేశారు. రాజీవ్ హత్య కేసు నిందితుడు పేరరివాలన్‌కు పెరోల్ ఇచ్చేందుకు సైతం ఆయన సిఫారసు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అడ్వకేట్ జనరల్‌తో చర్చించకుండా ప్రభుత్వ వర్గాలు ఎలాంటి నిర్ణయాలను ప్రస్తుతం తీసుకోవడం లేదని చెప్పవచ్చు. తాజాగా, ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ పాత్ర ప్రభుత్వానికి న్యాయపరంగా తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నానని ముత్తుకుమార స్వామి ప్రకటించడం చర్చకు దారితీసింది. హఠాత్తుగా తనను తప్పించరూ..! అంటూ ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఆయన లేఖ పంపించడంతో బలమైన కారణాలు ఏవో ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుతం అనేక పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో గుట్కా, అసెంబ్లీ రగడ వంటివి ప్రధానంగా> పరిగణించవచ్చు.
ప్రస్తుతం గుట్కా వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే సభ్యులపై సస్పెన్షన్ వేటుకు ప్రభుత్వం సిద్ధం కూడా అవుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు డీఎంకే సభ్యులు కసరత్తుల్లో ఉన్నారు. ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ ముత్తుకుమార స్వామి రాజీనామా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేనా అన్న ప్రశ్న బయలుదేరింది. అదే సమయంలో సీఎం పళని స్వామి ఆదేశాల మేరకే ఆయన తప్పుకున్నట్టుగా కూడా ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో సీనియర్ న్యాయవాది విజయనారాయణను నియమించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో అడ్వకేట్ జనరల్ పాత్ర కీలకంగా ఉంది. ఈ సమయంలో కొత్త వారిని నియమిస్తే, ఏ మేరకు ఫలితాలు ఉంటాయో అన్న అనుమానం వ్యక్తంచేసే వాళ్లూ ఉన్నారు. ఈ దృష్ట్యా, సీఎం ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసి ఉంటారా..? లేదా, మరెవైనా బలమైన కారణాలు ఉన్నాయా..? అనే చర్చ ఊపందుకుంది.