సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర ఉత్తర్వులపై న్యాయస్థానం సోమవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లోగా నిర్వహించాలని 2018లోనే హైకోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించిందన్నారు.
ఎన్నికల వాయిదాకు అప్పటి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను హైకోర్టు తోసిపుచ్చిందన్నారు. అయితే న్యాయస్థానం ఆదేశించిన విధంగా ఎన్నికల నిర్వహణలో కమిషన్ విఫలమైందని నివేదించారు. అనంతరం 2020లో ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టిన ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేసిందని తెలిపారు. ఆ తరువాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికలు నిర్వహించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వద్దనేందుకు సహేతుకమైన కారణం ఉందని, ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, దీని తరువాతే మిగిలినవని తేల్చి చెప్పారు.
షెడ్యూల్ రాకుండా ఎన్నికల ప్రక్రియ ఎలా మొదలవుతుంది?
పరిపాలనాపరమైన కారణాల వల్ల గతంలో ఎన్నికలు నిర్వహించలేకపోయామని ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రమైనదని, ఫలానా సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎవరూ శాసించలేరన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు స్పందిస్తూ ఎన్నికల షెడ్యూల్ రాకుండా ప్రక్రియ ఎలా మొదలవుతుందని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఏజీ శ్రీరామ్ నివేదించారు.
ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్ నిలుపుదలపై నిర్ణయం వాయిదా
Published Sat, Dec 5 2020 4:52 AM | Last Updated on Sat, Dec 5 2020 4:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment