అడ్వొకేట్ జనరల్‌గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి
- గవర్నర్ ఆమోదముద్ర.. సర్కారు ఉత్తర్వులు
- ప్రకాశ్‌రెడ్డి స్వగ్రామం వనపర్తి జిల్లా అమరచింత
- 1977లో న్యాయవాద వృత్తి ప్రారంభం
- 1998లో ఉమ్మడి ఏపీలో అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియామకం
సాక్షి, హైదరాబాద్/ అమరచింత/ ఆత్మకూరు (కొత్తకోట): రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఆ మేర న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విశ్వాసం ఉన్నంత వరకు ఆయన ఏజీగా కొనసాగుతారు. రాష్ట్రానికి ఆయన రెండో అడ్వొకేట్ జనరల్‌గా ఆయన కొనసాగనున్నారు. మొన్నటి వరకు ఏజీగా ఉన్న రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రకాశ్‌రెడ్డిని ప్రభుత్వం ఏజీగా నియమించింది. ప్రకాశ్‌రెడ్డి వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలో 1955 డిసెంబర్ 31న మురళీధర్‌రెడ్డి, అనుసూ యాదేవి దంపతులకు జన్మించారు. 1977లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు.
అదే ఏడాది డిసెంబర్ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి వద్ద జూనియర్‌గా న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1986 నుంచి సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన ప్రకాశ్‌రెడ్డి 1990లో తన ప్రాక్టీస్‌ను సుప్రీం కోర్టుకు మార్చారు. 1998 వరకు సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేసి తర్వాత తిరిగి హైకోర్టుకు వచ్చారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా నియమితులయ్యారు. 2004 మే వరకు ఆ పోస్టులో కొనసాగారు. 2000 సంవత్సరంలో హైకోర్టు ఆయ నకు సీనియర్ హోదా ఇచ్చింది. అలాగే హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. తన తండి మరణాంతరం ప్రకాశ్‌రెడ్డి స్వగ్రామంలో సొంత ఖర్చుతో అనేక సేవా కార్య క్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రకాశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు.
ఇదీ కుటుంబ నేపథ్యం..
అమరచింతకు చెందిన దేశాయ్ మురళీధర్‌రెడ్డి, అనసూయమ్మకు ప్రకాశ్‌రెడ్డి మొదటి కుమారుడు. ఈయనకు తమ్ముడు కరుణాకర్‌రెడ్డి, అక్క సౌజన్యారెడ్డి, చెల్లెళ్లు నలిని, స్వర్ణ ఉన్నారు. మురళీధర్‌రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా రాజకీయాల జోలికి వెళ్లకుండా న్యాయవృత్తిని ఎంచుకుని అంచలం చెలుగా ఎదిగారు. ఆయనకు భార్య గీతారెడ్డి, ఇద్దరు కుమారులు సుధాంశ్‌రెడ్డి, అభినాష్‌రెడ్డి ఉన్నారు. సుధాంష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, అభినాశ్‌రెడ్డి న్యాయవాదిగా కొనసాగుతు న్నారు. కాగా, అడ్వొకేట్ జనరల్‌గా తమ గ్రామానికి చెందిన ప్రకాశ్‌రెడ్డి నియమితులు కావడంతో అమరచింత గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నియామకం ప్రకటన వెలువడగానే గ్రామస్తులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.