
కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించారని ఆయన అన్నారు. శనివారం సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు చెందిన తనను ఏజీగా నియమించటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకంతోనే ఈ వృత్తిని ఎంచుకున్నానని స్పష్టం చేశారు.
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించటానికి కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత కేసును సైతం చట్టపరంగా ఎదుర్కొనేందుకు అందరి సహకారంతో ముందుకెళ్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న కోర్టు చిక్కుల్ని పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం న్యాయపరంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు.